Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యవసానాలపై దృష్టి సారించిన ప్రపంచ దేశాలు
- ద్రవ్యోల్బణం, కరోనాకు తోడు 'రష్యా వల్ల కష్టాల'పై సమీక్ష
- వెనిజులా చమురు వైపు చూపు !
- రంగంలోకి దిగిన అమెరికా బృందం
మాస్కో : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం బుధవారంతో 14వ రోజుకు చేరుకుంది. కాగా, ఈ దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలతో ఎదురయ్యే ఆర్థిక పర్యవసానాలపై యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకరించింది. ఆంక్షల కారణంగా చమురు ధరలు పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం కష్టాలు, కరోనా ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోవడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాలు ప్రధానంగా యూరప్ దేశాలు చమురు ధరల పెంపు భారాన్ని ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ ఆంక్షలపై రష్యా కూడా ప్రతిగా స్పందించింది. రష్యాకు శత్రు దేశాలు, ప్రాంతాలతో ఒక జాబితాను రూపొందించి, ఆమోదించింది. ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలను సమీక్షిస్తోంది. అయితే ఇటువంటి చర్యల వల్ల రష్యా మరింత ఏకాకి అవుతుందని నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఇప్పటికే తన వైఖరిని సుస్పష్టం చేసింది. ఏకపక్ష ఆంక్షల వల్ల ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కాదని, చర్చలొక్కటే మార్గమని తెలిపింది. మంగళవారం బీజింగ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జులతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఇలా ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక రంగం, ఇంధన, రవాణా, సరఫరా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయన్నారు. ఇప్పటికే కరోనాతో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ మరీ నాశనమవుతుందన్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి, ఇయు, రష్యా, అమెరికా, నాటో మధ్య సమాన ప్రాతిపదికన చర్చలు జరగాలని పిలుపిచ్చారు.
వెనిజులా చమురుపై సడలనున్న ఆంక్షలు ?
రష్యా ముడి చమురుపై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పూర్వపు స్థాయికి వస్తున్న ఆర్థిక పరిస్థితులు మళ్ళీ కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, అమెరికా ప్రతినిధి బృందం గత వారాంతంలో వెనిజులాలో పర్యటించింది. రష్యా చమురుపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి గల మార్గాలను అన్వేషిస్తున్న అమెరికా ఈ క్రమంలో వెనిజులా చమురు ఎగుమతులపై గల ఆంక్షలను సడలించే అవకాశాన్ని కూడా చర్చిస్తోంది. రష్యా చమురును నిలిపివేయడం వల్ల మొత్తంగా ప్రపంచ మార్కెట్ వినాశకర పర్యవసానాలు ఎదుర్కొనడానికి దారి తీస్తుందని రష్యా మీడియా వ్యాఖ్యానించింది. చమురు ధరలు అనూహ్యమైన రీతిలో పెరగవచ్చని బ్యారెల్‌కు 300డాలర్లు లేదా అంతకుపైనే వుండొచ్చునని రష్యన్ డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నొవాక్‌ను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు 60శాతం ఒఇసిడి (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ) యూరప్ సభ్యులకు వెళతాయి. పూర్తిగా రష్యా ఇంధన సరఫరాలను నిలిపివేసి యూరప్ మనలేదని, ఈ విషయంపై రష్యా పందెం కడుతోందని, కానీ వాస్తవానికి, అధిక మొత్తంలో ఆర్థిక నష్టాలను పణంగా పెట్టి యూరప్ ఇటువంటి వాటికి దిగడం కష్టమని జియామెన్ వర్శిటీలో ఇంధన నిపుణుడు లిన్ బొకియాంగ్ వ్యాఖ్యానించారు. కాగా ఇటలీకి ప్రత్యామ్నాయాలున్నాయని, మరో రెండేళ్ళలో అవి సాకారమవుతాయని ఇటలీ ఇంధన మంత్రి మంగళవారం తెలిపారు. రష్యా గ్యాస్ సరఫరాలు నిలిచిపోయిన పక్షంలో బాగా దెబ్బతినే దేశాల్లో స్లొవేకియా, ఆస్ట్రియా, ఇటలీలు వుండవచ్చని అంతర్జాతీయ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రధానమైన యూరప్ దేశాల్లో జర్మనీ బాగా దెబ్బతింటుందని అన్నారు.
క్రెమ్లిన్ చేతిలో గల అవకాశాలు
పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొనడానికి రష్యా పలు చర్యలను పరిశీలిస్తోంది. వాటిల్లో ఒకటి - తాజాగా ఆమోదం తెలిపిన 'మిత్ర దేశాలు కాని' దేశాల జాబితాలోని విదేశీ రుణదాతలకు విదేశీ మారకంలో చెల్లింపులు జరపాల్సి వుంటే వాటిని రష్యన్లు, కంపెనీలు, ప్రభుత్వం, ప్రాంతాలు, మున్సిపాలిటీలు అన్నీ కూడా రూబుల్స్‌లోనే చెల్లింపులు జరుపుతాయని రష్యా మీడియా పేర్కొంది. కొత్తగా, తాత్కాలికంగా తీసుకున్న ఈ చెల్లింపు చర్య నెలకు చెల్లించాల్సిన మొత్తం 10మిలియన్ల రూబుల్స్ (లేదా విదేశీ కరెన్సీలో అంతకు సమానమైన మొత్తం) దాటితేనే వర్తిస్తుందని కొత్తగా జారీ అయిన డిక్రీ పేర్కొంది. యువాన్‌ను లేదా సింగపూర్ డాలర్‌ను కూడా విదేశీ చెల్లింపులకు వాడే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే రూబుల్‌ను ఉపయోగించాలన్న నిర్ణయం వల్ల విదేశీ రుణదాతలు ఆర్థికపరమైన ముప్పులు ఎదుర్కొనే అవకాశం కూడా వుంది. రూబుల్ విలువ తగ్గి పనికిరాని కాగితంగా మారుతుందేమోననే భయాలు కూడా లేకపోలేదని పరిశోధనా సంస్థ అయిన గ్రేట్ వాల్ సెక్యూరిటీస్ హెడ్ వూ జిందూ గ్లోబల్ టైమ్స్‌తో వ్యాఖ్యానించారు.