Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా ప్రమేయం లేదన్న అమెరికా
- కీవ్‌కు కోట్లాది డాలర్ల సహాయ ప్యాకేజీ
- టర్కీలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ
- శాశ్వత కాల్పుల విరమణకు ఆఫ్రికన్ యూనియన్ పిలుపు
కీవ్/ మాస్కో/ వాషింగ్టన్ : ఉక్రెయిన్‌లో క్రిమి ఆయుధ ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు ఉన్నది నిజమే అయినప్పటికీ అందులో తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి విక్టోరియా నులాండ్ బుధవారం సెనేట్ విచారణ కమిటీ ముందు ఈ విషయం వెల్లడించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్‌లో 'బయోల్యాబ్లు'' నెలకొన్నాయని రష్యా అంతకుముందు ఆరోపించింది. అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పనిచేసే ల్యాబ్‌లు ఉన్నా , వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె సెనేట్ విచారణ కమిటీ ముందు వివరించారు. ఉక్రెయిన్‌లో జీవ ఆయుధ ల్యాబ్స్ ఉనికి గురించి, అవి రష్యా చేతికి చిక్కాయా అన్న అంశంపై విదేశీ వ్యవహారాల సెనేట్ కమిటీ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులను విచారిస్తున్నది. 1972లో కుదిరిన జీవ ఆయుధాల ఒప్పందం (బిడబ్ల్యుసి)ని ఉక్రెయిన్ ఉల్లంఘిస్తోందని రష్యా విమర్శించింది. దానిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ గురువారం స్పందించారు. రసాయన ఆయుధాల ఒప్పందం, జీవ ఆయుధాల ఒప్పందాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా అటువంటి ఆయుధాలను తయారుచేయడం లేదని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. ఉక్రెయిన్‌లో మానవతా అవసరాలు, రక్షణ సామర్ధ్యాల మెరుగుకు ఈ నిధులు వినియోగించేలా చర్యలు తీసుకోనుంది. టర్కీలోని అంటాలియా పట్టణంలో గురువారం రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాశ్వత కాల్పుల విరమణ పాటించాల్సిందిగా పుతిన్‌ను ఆఫ్రికన్ యూనియన్ కోరింది.
రష్యాపై ఎదురుదాడి
జీవ, రసాయన ఆయుధ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నది రష్యానే తప్ప తాము కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రైస్ ఎదురు దాడి చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేదు. వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి జెన్‌సాకి కూడా ప్రైస్ వ్యాఖ్యలను సమర్ధించారు. 'తప్పుడు దాడి' (ఫాల్స్ ఫ్లాగ్ అటాక్) జరిపేందుకు మాస్కో రంగాన్ని సిద్ధం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు అంతర్జాతీయ జీవ ఆయుధాల ఒప్పందాన్ని బలోపేతం చేయాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. సభ్య దేశాలు ఈ ఒప్పందానికి ఆనుగుణంగా వ్యవహరిస్తున్నాయో లేదో నిర్ధారించుకునే యంత్రాంగాన్ని చేర్చడం ద్వారా ఒప్పందాన్ని పరిపుష్టం చేయాలని కోరింది. ఉక్రెయిన్ వ్యాప్తంగా పలు ల్యాబ్‌లో నిల్వచేసిన ప్రమాదకరమైన క్రిములను ఉక్రెయిన్ అధికారులు హడావిడిగా ధ్వంసం చేశారని రష్యా సైన్యం సోమవారం పేర్కొంది.
ఉక్రెయిన్‌కు అమెరికా సాయం
రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు కోట్లాది డాలర్ల సహాయ ప్యాకేజీని అమెరికా బుధవారం ఆమోదించింది. 1360 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించే కొత్త బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. కీవ్‌కు మానవతా, ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్ సహా ఆ ప్రాంతంలోని బాల్టిక్ దేశాలు, ఇతర మిత్రపక్షాల రక్షణ సామర్ధ్యాలను మెరుగుపరిచేందుకు కూడా వినియోగించనున్నారు. ఇంకా మరింత సాయం అందుతుందని ప్రకటించారు. తొలుత దాడులు ప్రారంభమైన వెంటనే ఉక్రెయిన్‌కు 640 కోట్ల డాలర్ల నిధులను అందజేయాలని బైడెన్ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులను కోరింది. కానీ ఆ తర్వాత ఆ మొత్తాన్ని రెట్టింపు చేశారు. రష్యా జరిపే దాడులపై పోరు సల్పాలంటే ఉక్రెయిన్‌కు ఆ ప్రాంతంలోని ఇతర మిత్రులకు అత్యవసరంగా నిధులు అవసరపడతాయని సెనెట్ నేత చుక్ షుమర్ (న్యూయార్క్ డెమోక్రాట్), స్పీకర్ నాన్సీ పెలోసి (కాలిఫోర్నియా)లు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు భేటీ
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబాలు టర్కీలోని చిన్న రిసార్ట్ పట్టణమైన అంటాలియాలో గురువారం సమావేశమైనట్లు స్థానిక మీడియా తెలిపింది.
శాశ్వత కాల్పుల విరమణ జరగాలి : ఆఫ్రికన్ యూనియన్
ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో సెనెగల్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ ప్రస్తుత ఛైర్పర్సన్ మాకీ సాల్ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్‌లో శాశ్వత కాల్పుల విరమణను పాటించేందుకు చర్యలు తీసుకోవాలిందిగా కోరారు. ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా రష్యా అధినేతను కోరామని, ఆయన కూడా తాము చెప్పినదంతా విని, సుముఖత వ్యక్తం చేయడాన్ని సాల్ స్వాగతించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల గత వారం సాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలీనోద్యమ సూత్రాలకు, వివాదాల శాంతియుత పరిష్కారానికి సెనెగల్ కట్టుబడి వుందని పునరుద్ఘాటిం చారు. దాడులు ప్రారంభమైన వెంటనే, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇరు పక్షాలు చర్చలు జరపాలని ఎయు కమిషన్ ఛైర్పర్సన్ మౌసా ఫాకీ మహమత్, సాల్ కోరారు. పుతిన్ కూడా తమ సైనిక చర్య గురించి సాల్‌కు వివరించారని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది.