Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రగాఢ సంతాపం
కాలిఫోర్నియా : ప్రపంచ ప్రఖ్యాత మార్క్సిస్ట్ తత్వవేత్త, రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ ఏజాజ్ అహ్మద్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని తన నివాసంలో బుధవారం కన్నుమూశారు. వృద్దాప్య సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి తిరిగి వచ్చారు. 1941లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన ఐజాజ్ దేశ విభజన సమయంలో తన తల్లిదండ్రులతో పాకిస్తాన్‌కు తరలివెళ్లిపోయారు. చదువు పూర్తయిన తర్వాత అమెరికా, కెనడాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఫ్రంట్‌లైన్ మేగజైన్‌కు ఎడిటోరియల్ కన్సల్టెంట్‌గా కూడా చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ న్యూస్‌క్లిక్‌కు వార్తా విశ్లేషకుడిగాను, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ, సెంటర్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్‌లో ప్రొఫెసర్ ఫెలోగా వున్నారు. అలాగే టొరంటోలోని యార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు భారత్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలన్నింటినీ కలిసికట్టుగా ఒకచోట చేర్చే రాజకీయ కేంద్రం లేకపోవడం పట్ల ఏజాజ్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేసేవారు. గతేడాది బెంగళూరు కలెక్టివ్ నిర్వహించిన ఒక చర్చా గోష్టిలో ఆయన మాట్లాడుతూ, పాలనా వ్యవస్థగా ప్రజాస్వామ్యం విఫలమైందని వ్యాఖ్యానించారు. ''నిజంగా ప్రజాస్వామ్యం ఉండాలంటే మనకు సోషలిజం వుండాలని నేను భావిస్తున్నాను.'' అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు పొసగడం లేదని అన్నారు.
సీపీఐ(ఎం) సంతాపం
ఐజాజ్ అహ్మద్ మృతి పట్ల సీపీఐ(ఎం) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. అత్యంత గౌరవనీయమైన సిద్ధాంతకర్త అయిన ఐజాజ్కు సీపీఐ(ఎం)తో సన్నిహిత సంబంధాలున్నాయి. భారత్‌లో సదస్సులు, సమావేశాలు, సభలకు హాజరవడమంటే ఆయనకు చాలా ఆసక్తి. ఆయన మంచి వక్త కూడా. మార్క్సిజాన్ని సమర్ధిస్తూ ఆయన రాసిన వ్యాసాలు క్లాసిక్స్ కోవలోకే వస్తాయని భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని సీపీఐ(ఎం) తన సంతాప సందేశంలో పేర్కొంది. వీసా నియంత్రణల వల్ల ఆయన భారత్‌ను వీడాల్సివచ్చిందని, ఆ తర్వాత అనారోగ్యం కారణంగా స్వదేశానికి రావాలనే ఆకాంక్ష వున్నా చివరి వరకు రాలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిజాన్ని విశ్వసించి, దాని కోసం పోరాడేవారికి ఆయన మృతి తీరని లోటని సీపీఐ(ఎం) పేర్కొంది. మార్క్సిస్టు, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలకు ఆయన తరచూ వ్యాసాలు రాసేవారు. హిందూత్వ మతోన్మాదం, ఫాసిజం, లౌకికవాదం, భారత నేపథ్యంలో వామపక్షాలకు గల అవకాశాలుపై ఆయన అనేక రచనలు చేశారు. ప్రభాత్ పట్నాయక్‌తో కలసి ఎ వరల్డ్ టు విన్ పుస్తకానికి ఆయన సహ సంపాదకులుగా వ్యవహరించారు. ఇర్ఫాన్ హబీబ్‌తో కలసి ఎస్సేస్ ఆన్ ది కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పుస్తకాన్ని రాశారు. 'ముస్లిమ్స్ ఇన్ ఇండియా: బీహార్', సోషల్ జియోగ్రఫీ, 'ఇన్ థియరీ: క్లాసెస్, నేషన్స్ అండ్ లిటరేచర్', 'ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ది ఇంపీరియలిజం ఆఫ్ అవర్ టైమ్' , 'ఇన్ అవర్ టైమ్: ఎంపైర్, పాలిటిక్స్ అండ్ కల్చర్' వంటి రచనలెన్నో చేశారు. ఐజాజ్ అహ్మద్ పిల్లలు రవి, అదిల్, అనురాధ కల్హాన్, మొనీజా ఇతర కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు సీపీఐ(ఎం) తన సానుభూతి తెలియజేసింది.