Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పచ్చజెండా వూపిన రష్యా రక్షణ శాఖ
మాస్కో : ఉక్రెయిన్‌లో రష్యా తరపున పోరాడాలని 16వేల మందికి పైగా విదేశీ సైనికులు కోరుకుంటున్నారని రష్యా రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. జిహాదిస్టులపై పోరాడిన అనుభవం కలిగిన వీరిలో చాలామంది మధ్య ప్రాచ్యానికి ముఖ్యంగా సిరియాకి చెందినవారున్నారు. వీరు ఉక్రెయిన్‌కు వెళ్ళి, రష్యా మద్దతు కలిగిన డాంటెస్క్, లుగాన్స్క్ రిపబ్లిక్ల బలగాల్లో చేరతారని తెలిపారు. జాతీయ భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తక్షణమే వారందరికీ పచ్చజెండా వూపాల్సిందిగా సూచించారు. తాము వచ్చి పోరాటంలో పాల్గొంటామన్న వారి అభ్యర్ధనల పట్ల సానుకూలంగా స్పందించాలని భావిస్తున్నామని మంత్రి సెర్గి షోయిగు చెప్పారు. పైగా వారు డబ్బు కోసం ఇదిచేయడం లేదని, వారి ఆకాంక్ష మేరకు ఈ యుద్ధంలో పాల్గొంటామని అంటున్నారని తెలిపారు. గత పదేళ్ళలో అత్యంత క్లిష్టమైన సమయాల్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులపై పోరు సమయంలో వారు చాలా సాయం చేశారని, వీరిలో చాలామంది తమకు తెలుసునని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ ఆలోచనను సమర్ధించారు. పైగా ఉక్రెయిన్‌లో తమ ప్రత్యర్ధులు కూడా విదేశీ వలంటీర్లను రిక్రూట్ చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం కానీ, వారిని సమర్ధించే పశ్చిమ దేశాలు కానీ ఈ విషయాన్ని దాచడం లేదని, బహిరంగంగానే చెబుతున్నాయని, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఉక్రెయిన్ కోసం పోరాడేందుకు వచ్చిన విదేశీ సైనికులకు కిరాయి సైనికులుగా పుతిన్ ఇంతకుముందు ముద్ర వేశారు. ప్రధానంగా రష్యాకు సాయం కోసం పౌరులను స్వచ్ఛందంగా యుద్ధ రంగానికి అనుమతించే విషయంపై జాతీయ భద్రతా మండలి సమావేశంలో చర్చించలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఇప్పటివరకు 52 దేశాల నుండి దాదాపు 20వేల మంది విదేశీ పౌరులు తమకు సాయంగా వచ్చి పోరాడేందుకు అంగీకరించారని ఉక్రెయిన్ తెలిపింది. కాగా కొంతమంది వలంటీర్లను పోరాడేందుకు అనుమతించింది.
ఇటీవల రష్యా గుర్తించిన ఉక్రెయిన్‌లోని చీలిక ప్రాంతాలైన రెండు రిపబ్లిక్లకు మరిన్ని అధునాతన ఆయుధాలను అందించాలని కూడా షోయుగు సమావేశంలో సూచించారు. పశ్చిమ దేశాలు సరఫరాచేసిన విమాన విధ్వంసక, ట్యాంక్ విధ్వంసక క్షిపణులతో సహా పలు ఆయుధాలను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, వాటిని రెబెల్స్ బాగా ఉపయోగించగలరని అన్నారు. పుతిన్ దీనికి కూడా ఆమోద ముద్ర వేశారు. అవసరమైతే సంబంధిత ఉత్తర్వులపై సంతకాలు జరుగుతాయన్నారు. తూర్పు యూరప్‌లో నాటో మోహరింపు విషయం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని మంత్రి చెప్పారు. దీన్ని ఎలా ప్రతిఘటించాలనే విషయమై రష్యా మిలటరీకి ప్రణాళికలు వున్నాయని చెప్పారు. అయితే, దీనిపై ఇంకా చర్చలు జరపడం అవసరమని పుతిన్ అన్నారని చెప్పారు.