Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మహమ్మారిపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- పరీక్షలు చేయడం తగ్గడం పట్ల ఆందోళన
న్యూయార్క్ : కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయెసెస్ కోవిడ్‌ను మహమ్మారిగా వ్యాఖ్యానిస్తూ 2020 మార్చి 11న మొట్టమొదటిసారిగా ప్రకటన చేశారు. రెండేళ్లు గడిచినా ఇంకా ఆ వైరస్ ఎలా రూపాంతరం చెందుతూ వస్తోందో, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎలా పెచ్చరిల్లుతుందో ఆయన వివరించారు. రెండేండ్ల తర్వాత దాదాపు 60లక్షల మందికి పైగా ప్రజలు ఈ వైరస్‌తో మరణించారని టెడ్రోస్ ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. దాదాపు 44.4కోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు,మరణాలు తగ్గుతున్నప్పటికీ,అనేక దేశాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నప్పటికీ,ఇంకా కరోనా ముప్పు ముగిసిపోలేదని ఆయన హెచ్చరించారు. గత వారంలోనే పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 46శాతం కేసులు పెరిగాయన్నారు. అక్కడ 39లక్షల కేసులు నమోదయ్యాయన్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ల పంపిణీ, పరీక్షలు చికిత్సలు జరగకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు పరీక్షలు చేయడాన్ని తగ్గించడం పట్ల ఆయన హెచ్చరించారు. దీనివల్ల వైరస్ ఎక్కడ వుందో, ఎలా వుందో తెలుసుకోవడానికి మనకు అవరోధాలు ఏర్పడుతాయని అన్నారు. కాబట్టి వైరస్ విషయంలో ఉదాసీనత పనికిరాదని హెచ్చరించారు. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం ప్రపంచవ్యాప్తంగా 5శాతం కేసులు తగ్గాయి. మరణాల రేటు 8శాతం తగ్గింది. పరీక్షలు చేయడం తగ్గడం వల్లనే కేసుల సంఖ్య కూడా సరిగ్గా వెల్లడి కావడం లేదని డబ్ల్యుహెచ్ఓ టెక్నికల్ లీడ్ మరియా వాన్ ఖెర్కోవ్ హెచ్చరించారు.