Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరియుపోల్‌లో దయనీయ పరిస్థితులు
కీవ్, మాస్కో : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు మరింత ఉధృతంగా ప్రయత్నాలు చేపడుతున్నాయి. నగరానికి అన్నివైపుల నుండి ఒత్తిడి పెంచుతున్నాయి. ఈశాన్య ప్రాంతం నుండి కొంత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతోంది. మరోవైపు మరియుపోల్ నగరాన్ని చుట్టుముట్టడంతో అక్కడ పరిస్థితి దయనీయంగా ఉంది. మరియుపోల్ శివార్లను మాత్రమే రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. గతవారం నుంచి ఆ నగరం దిగ్బంధంలో వుందని, విద్యుత్, గ్యాస్, నీరు, ఆహారం లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉక్రెయిన్ మిలటరీ శనివారం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. 1500 మందికి పైగా మరణించారని అధికారులు చెబుతున్నారు. 80మంది తలదాచుకున్న ఒక మసీదుపై కూడా బాంబులు వేశారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ట్విట్టర్లో తెలిపింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో శనివారమంతా వైమానిక దాడులను హెచ్చరిస్తూ సైరన్లు మోగుతునే వున్నాయి. రాజధాని కీవ్, ఒడెసా, ద్నిప్రో, ఖర్కీవ్లతో సహా పలు నగరాల్లో దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. రష్యా దాడులు ప్రారంభించి ఇప్పటికి రెండు వారాలకు పైగా గడిచింది. రోజుల తరబడి రష్యా బలగాలు దాడులు చేస్తూ వుండడంతో మరియుపోల్ వంటి నగరాల్లో యుద్ధ నేరాలకు పాల్పడే పరిస్థితులు వున్నాయంటూ ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరియుపోల్ నగరంలో పరిస్థితి దుర్భరంగా మారడంతో బాంబుదాడుల నుండి తప్పించుకోవడానికి చాలామంది నగరం విడిచి పారిపోతున్నారని, అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా వుందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అధికారి వ్యాఖ్యానించారు. వేలాదిమంది ప్రజలు నగరంలో దిగ్బంధించబడ్డారని మెడికల్ చారిటీకి నాయకత్వం వహిస్తున్న స్టీఫెన్ కార్నిష్ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా బాంబు దాడుల్లో 1582మంది మరణించారని, 12రోజులుగా దిగ్బంధనం కారణంగా వందలు వేల సంఖ్యలో ప్రజలు ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కూడా లేకపోవడంతో హీటర్లు పనిచేయడం లేదని మరియుపోల్ సిటీ కౌన్సిల్ తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామనడాన్ని రష్యా ఖండించింది. కీవ్, సుమీ నగరాలతో సహా పలు పట్టణాలు, గ్రామాల నుండి ప్రజలను సురక్షితంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ఇరియానా వెరెషుక్ తెలిపారు. రష్యా బలగాలు కూడా కాల్పుల విరమణ పాటిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరియుపోల్ నుండి ప్రజల తరలింపు ఈ వారం కూడా విఫలమైంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుందని ఉక్రెయిన్ హోం శాఖ సలహాదారు వ్యాఖ్యానించారు.