Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కరోజే 6లక్షలకు పైగా కొత్త కేసులు :429మంది మృతి
సియోల్ : దక్షిణ కొరియాలో కోవిడ్ ఉధృత రూపం దాలుస్తోంది. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా సహా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మళ్ళీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. కాగా కోవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో నెమ్మదిగా ప్రపంచ దేశాలన్నీ ఆంక్షలను సడలిస్తున్న వేళ ఆలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఒమిక్రాన్ వేరియంట్లో పరివర్తనాలు చోటు చేసుకుని కొత్తగా తలెత్తిన బిఎటు లేదా స్టెల్త్ ఒమిక్రాన్ కారణంగానే ఈ కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. గురువారం దక్షిణ కొరియాలో అనూహ్యంగా కేసులు, మరణాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మొత్తంగా ఆంక్షలన్నింటినీ సడలించాలని ప్రభుత్వం భావించిన సమయంలో కేసులు పెచ్చరిల్లుతున్నాయి. గురువారం ఒక్క రోజే 6,21,328 కొత్త కేసులు తలెత్తాయని, 429మంది మరణించారని అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ట్రాకింగ్, ట్రేసింగ్ మూకుమ్మడిగా పరీక్షలు, వ్యాక్సినేషన్లు వంటి చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా సంక్రమిస్తుండడమే దీనికి కారణమని కొరియా వ్యాధి నియంత్రణా సంస్థ కెడిసిఎ తెలిపింది. ప్రభుత్వ ఆరోగ్య అధికారులు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు నాలుగు లక్షల మధ్య వుండొచ్చునని ప్రభుత్వం అంచనా వేయగా, దాన్ని దాటి మరోరెండు లక్షల కేసులు అదనంగా నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దక్షిణ కొరియా 17,76,045 కేసులతో రెండో స్థానంలో వుంది.అయితే పరిస్థితి ఇంత ప్రమాదకరంగా వున్నప్పటికీ ఆంక్షలు ఎత్తివేయాలనే ఆలోచనతోనే మందుకు సాగాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు కూడా ఆ నిర్ణయానికే మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది.
వియత్నాంలో కూడా
గత కొద్ది రోజులుగా వియత్నాంలో కూడా కరోనా విజృంభిస్తోంది. రోజుకు దాదాపు రెండు లక్షల కేసులు నమోదవుతున్నాయి. గురువారం 1,78,112కేసులు వచ్చాయి.76మంది మరణించారు. ఒకపక్క కేసులు పె రుగుతున్నా విదేశాల నుండి వచ్చేవారిపై క్వారంటైన్ ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇతర ప్రయాణ ఆంక్షలను కూడా తొలగించాలని చూస్తోంది.
చైనాలోనూ
ఈ రెండేళ్ళ కాలంలోనూ లేని రీతిలో చైనాలో ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈశాన్య ప్రావిన్స్ జిలిన్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడ తాత్కాలికంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.