Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా ప్రయోజనాలు దెబ్బతీస్తే ఊరుకోం
- ఉక్రెయిన్ విషయంలో మాది స్వతంత్ర వైఖరి
- తేల్చి చెప్పిన చైనా
బీజింగ్, మాస్కో, వాషింగ్టన్, కీవ్ : ఉక్రెయిన్ విషయంలో అమెరికా బెదిరింపులను, బలవంతపు చర్యలను ఎన్నడూ ఆమోదించేది లేదని పేర్కొంటూ చైనా కఠినమైన సంకేతాలు పంపింది. చైనా చట్టపరమైన ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా చర్యలు తీసుకున్నట్లైతే తాము కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులపై శుక్రవారం అమెరికా, చైనా నేతల మధ్య ఫోన్ కాల్‌కు కొద్ది గంటల ముందు ఈ మేరకు సంకేతాలు వెలువడ్డాయి. చైనా సంస్థల, వ్యక్తుల ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా వ్యవహరిస్తే చైనా చూస్తూ ఊరుకోదని, కచ్చితంగా తీవ్ర స్థాయిలో స్పందిస్తుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని చైనా అధికారి ఒకరు గ్లోబల్ టైమ్స్‌కు తెలిపారు. దీనిగురించి ఎలాంటి భ్రమలతో వుండరాదని లేదా తప్పుడు లెక్కలు వేసుకోరాదని అన్నారు. అమెరికా సరైన వైఖరి తీసుకోవాలని ఆ అధికారి కోరారు. ద్వైపాక్షిక సంబంధాలపై, శాంతి చర్చలను ప్రోత్సహించడంపై, ఉక్రెయిన్ పరిస్థితులపై ఇరువురు అధినేతలు ఫోన్‌కాల్‌లో చర్చించాలని అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా ఆమోదించిందని చెప్పారు. రష్యాకు చైనా సైనిక సాయం చేస్తోందంటూ బైడెన్ ప్రభుత్వం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న నేపథ్యంలో చైనా ఈ మేరకు గట్టి సంకేతాలు వెలువరించింది. చైనాను బెదిరిస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించింది. రష్యా యుద్ధానికి మద్దతును అందించేలా తీసుకునే చర్యలకు చైనానే బాధ్యత వహించాలని, అవసరమైతే ఆర్థిక వ్యయాలను వారిపై రుద్దేందుకు కూడా వెనుకాడబోమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అంతకుముందు హెచ్చరించారు.
ఉక్రెయిన్ ఘర్షణపై స్వతంత్ర వైఖరి
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభంపై చైనా స్వతంత్ర వైఖరి అనుసరిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ వెల్లడించారు. రష్యాకు మద్దతివ్వాలని చైనా భావించినట్లైతే యుద్ధ వ్యయాన్ని చైనాపై విధిస్తామని గురువారం అమెరికా
విదేశాంగ మంత్రి బ్లింకెన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఝావో వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిష్పాక్షికంగా, న్యాయమైన రీతిలో పరిస్థితులను సమీక్షించి, స్వతంత్రంగా ఒక ఆలోచనకు రానున్నట్లు తెలిపారు. అమెరికా నుండి ఒత్తిడి వచ్చినంత మాత్రాన తమ వైఖరి మారబోదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం అమెరికా, నాటో చేతుల్లో వుందని చైనా అభిప్రాయపడుతోందని చెప్పారు. వారే ఈ సంక్షోభానికి కారకులని విమర్శించారు. ఇందులో యురోపియన్ మిత్రులకు కూడా వాటా వుందని, పరిస్థితులను చక్కబరిచేందుకు వాస్తవాలను గ్రహించి, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఉక్రెయిన్‌కు కావాల్సింది సైనిక సాయం కాదు మానవతా సాయం
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం అందచేయడంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తీవ్రంగా స్పందించింది. దీనివల్ల ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పునరుద్ధరణ దెబ్బతింటుందని పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఇప్పుడు కావాల్సింది మానవతా సాయమని, ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని, అన్ని పక్షాలు కూడా దానిననుసరించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఉక్రెయిన్‌కు ఆహారం, పాల పొడి, స్లీపింగ్ బ్యాగ్‌లు, బొంతలు, వాటర్‌ప్రూఫ్ మ్యాట్లు తదితరాలను అందచేశామని లిజియాన్ తెలిపారు. కానీ అమెరికా వారికి మారణాయుధాలు అందచేస్తోందని అన్నారు. ప్రజలకు ఏవి కావాలో ఎంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఉక్రెయినియన్లకు చైనా అందిస్తున్న మానవతా సాయానికి అంతర్జాతీయ సమాజం హర్షిప్తోందన్నారు.