Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ అధ్యక్షుడి విజ్ఞప్తి
- మొదటిసారిగా హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించిన రష్యా
- ఉక్రెయిన్ ఆయుధ గిడ్డంగి ధ్వంసం
- జిపిఎస్ నుండి తొలగించినా ఆందోళన అనవసరమన్న రష్యా స్పేస్ చీఫ్
- యుద్ధం ముగింపునకు తొందరపడుతున్న ఇరు పక్షాలు
కీవ్, మాస్కో : తమ మాతృభూమిపై రష్యా జరుపుతున్న దాడులను నిలువరించేందుకు సమగ్రంగా, అర్ధవంతమైన రీతిలో శాంతి చర్చలు జరగాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం పిలుపిచ్చారు. లేనిపక్షంలో ఈ యుద్ధ నష్టాల నుండి కోలుకోవడానికి రష్యాకు కూడా అనేక తరాలు పడుతుందని హెచ్చరించారు. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ వైఖరి మారలేదని అధ్యక్షుని సలహాదారు మిఖాయిలో పొడొలాక్ స్పష్టం చేశారు. ''ముందుగా కాల్పుల విరమణ జరగాలి, ఆ తర్వాత రష్యా బలగాలు వైదొలగాలి, నిర్దిష్ట ఫార్ములాలతో ఉక్రెయిన్‌కు కఠినమైన భద్రతా హామీలు ఇవ్వాలి.'' అని ఆయన ట్వీట్ చేశారు. నాల్గో దఫా చర్చలు సోమవారం ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి.
ఇదిలావుండగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా రష్యా హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరానికి సమీపంలోని ఆయుధ డిపోను ధ్వంసం చేసేందుకు అత్యంత అధునాతనమైన కింఝాల్ క్షిపణులను ఉపయోగించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్ బలగాలకు చెందిన క్షిపణులు, మందుగుండు సామాగ్రికి సంబంధించిన భూగర్భ గిడ్డంగిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి ప్రకటించారు. ఈ క్షిపణులు ధ్వని వేగాన్ని మించి పదిరెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. వైమానిక రక్షణ వ్యవస్థలను అధిగమించి దూసుకెళతాయి. కాగా, రష్యాపై అమలు చేసే ఆంక్షల్లో భాగంగా అమెరికా జిపిఎస్ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నుండి రష్యాను తొలగించవచ్చని రష్యా స్పేస్ చీఫ్ హెచ్చరించారు. అయితే ఎవరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రష్యాకు స్వంత గ్లోనాస్ పొజిషనింగ్ వ్యవస్థ వుందని అది ప్రతి స్మార్ట్ ఫోన్‌కు అనుసంథానమై పనిచేస్తోందని శనివారం విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు. ఫిబ్రవరి 24ను రష్యా దాడులు ఆరంభించింది. కానీ ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో రాజ ధాని కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ రష్యా దళాలు చాలాచోట్ల ముందుకు సాగలేక పోయాయి. అయితే చాలాచోట్ల నగరాలను దిగ్బంధించడం, పట్టణ ప్రాంతాలను శిధిలాల కుప్పగా మార్చడం కనిపిస్తోంది. కీవ్, చెర్నిహివ్, జైటోమిర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారు జామునుండే వైమానిక దాడులకు గుర్తుగా సైరన్లు మోగాయి. కానీ తాజాగా దాడులు జరిగినట్లు వెంటనే వార్తలందలేదు.
యుద్ధం ప్రారంభమైన వెంటనే రష్యాను లక్ష్యంగా చేస్తూ పశ్చిమ దేశాలు అనూహ్యమైన రీతిలో ప్రకటించిన ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా పుతిన్ ప్రారంభించిన యుద్ధాన్ని ఏ మాత్రమూ ప్రభావితం చేయలేకపోయాయి. కీలక ఓడరేవు నగరమైన మరియుపోల్‌పై పట్టు బిగించామని రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అజోవ్ సముద్ర తీరంతో తాత్కాలికంగా సంబంధాలు కట్ అయ్యాయని పేర్కొంది. ఇది ఉక్రెయిన్‌కు తీరని నష్టమని వ్యాఖ్యానించింది. అయితే రష్యా కూడా ఈ యుద్ధంలో భారీగానే నష్టపోయిందని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. రష్యా దళాల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోందని అధికారులు పేర్కొంటున్నారు. మూడు వారాలకు పైగా యుద్ధం జరిగినా ఇప్పటివరకు ప్రధాన నగరాలపై పుతిన్ పట్టుసాధించలేకపోయారు. జెలెన్స్కీ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ధృఢచిత్తంతో ఈ దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కాగా యుద్ధాన్ని ఇక ముగించాలని అటు పుతిన్, ఇటు జెలెన్స్కీ ఇద్దరు కోరుకుంటున్నారు. కానీ ఏ రీతిన ఈ యుద్ధానికి స్వస్తి పలకాలనేది పుతిన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వెంటనే సమగ్రమైన రీతిలో చర్చలు జరగాల్సిన సమయం ఆసన్నమైందని జెలెన్స్కీ శనివారం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించి, న్యాయం జరిగేలా చూడాల్సిన సమయమిదని అన్నారు. లేకపోతే రష్యా నష్టాలు కూడా కోలుకోలేని రీతిలో చాలా భారీగా వుంటాయని హెచ్చరించారు. నాటో కూటమికి వెలుపల ఉక్రెయిన్‌కు భద్రతా రక్షణకు హామీ కల్పించేందుకు ఒక రాజకీయ ఫార్ములాను రూపొందించే దిశగా ఈ వారం చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఇరు పక్షాలు తెలిపాయి. కానీ తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, రష్యా బలగాల ఉపసంహరణ జరగాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. ఎదుటి పక్షం వారే అనవసరంగా కాలయాపన చేస్తున్నారని ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో స్తంభించిపోయిన వాణిజ్య ఆహార సరఫరా కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించడమే తమ ప్రస్తుత కర్తవ్యమని ఆ దిశగా కృషి జరుగుతోందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ఎమర్జన్సీ కోఆర్డినేటర్ జాకబ్ కెర్న్ తెలిపారు.
ఆయుధాల నిల్వలు ఖాళీ అయ్యాయి : కెనడా
ఉక్రెయిన్‌కు పెద్ద మొత్తంలో ఆయుధాలందచేస్తున్న కెనడా ఇక తమ వద్ద ఆయుధ నిల్వలు ఖాళీ అయ్యాయని ప్రకటించింది. ఈ మేరకు కెనడా రక్షణ శాఖ మంత్రి అనితా ఆనంద్ ప్రకటించారు.