Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం: ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్ ఏప్రిల్ 2 నుంచి నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు 30వ వార్షికోత్సవాన్ని నిర్వహించకుంటున్న సందర్భంగా ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు నఫ్తలి బెన్నెట్ భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, భద్రత, సైబర్, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంగానూ ఈ పర్యటన జరగనుంది. ఈ వివరాలను ఇజ్రాయిల్ ప్రధాని విదేశీ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు. 'భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్ తొలిసారిగా ఏప్రిల్ 2 నుంచి భారత్‌లో పర్యటించనున్నారు' అని తెలిపారు. గ్లాస్కోలో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కాప్ 26 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలూ తొలిసారి కలుసుకున్నారని, ఆ సమయంలో మోడీ ప్రధాని బెన్నెట్‌ను ఆహ్వానించారని ప్రకటన తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకూ భారత్‌లో పర్యటిస్తారని ప్రకటన పేర్కొంది. 'ఈ పర్యటన యొక్క ఉద్దేశ్యం ఇదరు దేశాల మధ్య వ్యూహాత్మక మైత్రిని ముందుకు తీసుకెళ్లడం, బలోపేతం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం. అదేవిధంగా, ఆవిష్కరణలు, ఆర్థికం, పరిశోధన-అభివద్ధి, వ్యవసాయం సహా వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి ఇరు నేతలు చర్చిస్తారు' అని ప్రకటన తెలిపింది. బెన్నెట్ ఈ పర్యటనలో భారత ప్రధాని మోడీ, సీనియర్ ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక యూదు నాయకులతోనూ సమావేశాల్లో పాల్గొంటారు.