Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన వెంటనే పలు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా రష్యన్ చమురుపై నిషేధం విధించే విషయాన్ని చర్చించాలని యురోపియన్ యూనియన్ మంత్రులు భావిస్తున్నారు. ''ఇక ఇంధన రంగం గురించి మాట్లాడుకోవడం అనివార్యమవుతోంది. రష్యాకు అతిపెద్ద ఆదాయవనరుగా వున్న చమురు గురించి మనం కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే.'' అని లిథుయేనియా విదేశాంగ మంత్రి గాబ్రియెల్ లాండ్స్బెర్జిస్ వ్యాఖ్యానించారు. అయితే రష్యా ముడి చమురును కొనుగోలు చేసే అతిపెద్ద దేశంగా వున్న జర్మనీ మాత్రం ఆచితూచి అడుగు వేయాలని భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే యూరప్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరో ఇయు దేశమైన బల్గేరియా కూడా ఈ నిర్ణయాన్ని నిలపాలని కోరే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో ఇయు విదేశాంగ, రక్షణ మంత్రులు చర్చలు జరపనున్నారు.
ఐదవ దఫా విధించే ఆంక్షల్లో మరింతమంది రష్యన్ల పేర్లు వుండబోతున్నట్లు తెలుస్తోందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నాటో మిత్ర దేశాలు, ఇయు, జి 7 దేశాలతో గురువారం చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రస్సెల్స్ రానున్నారు. ఈలోగా వీరు ఇంధన నిషేధంపై చర్చించనున్నారు. కాగా, చమురు ఆంక్షలు విధిస్తే తీవ్ర పర్యవసానాలు వుంటాయని మాస్కో ఇప్పటికే హెచ్చరించింది.
ఇటువంటి నిషేధపు చర్యలు యూరప్ ఖండంలోని ఇంధన సమతుల్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల ఇయు ప్రభావితమైనంతగా అమెరికాపై ప్రభావం వుండదని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రతి ఒక్కరినీ ఇబ్బందుల పాల్జేస్తాయని అన్నారు.
పశ్చిమ దేశాలు కొనకపోతే మర్కెడైనా తమ చమురు ఉత్పత్తులను విక్రయించుకుంటామని రష్యా ఇప్పటికే తేల్చి చెప్పింది. భారత్ ఇప్పటికే రష్యా ముడి చమురును కొనుగోలు చేసింది. రష్యా ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టకుండా సభ్య దేశాల కంపెనీలను గత వారం ఇయు నిషేధించింది. రష్యా నుండి వచ్చే చమురు, గ్యాస్ దిగుమతులను ఇప్పటివరకు నిషేధించలేదు. రష్యా నుండి ఇయుకు దాదాపు 40శాతం గ్యాస్ సరఫరా అవుతుంది. రష్యా చమురు ఎగుమతుల్లో సగానికి పైగా యూరప్ దేశాలకే వెళుతున్నాయి.
జెలెన్స్కీ వ్యాఖ్యలకు ఇజ్రాయిలీ పార్లమెంట్ నిరసన
ఇజ్రాయిల్ పార్లమెంట్‌నుద్దేశించి ఆదివారం ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు చేయాల్సినంత సాయం చేయడం లేదని జెలెన్స్కీ ఇజ్రాయిల్‌ను విమర్శించారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలా లేదా రష్యాకు ఇవ్వాలా అని స్పష్టంగా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగేలా కృషి చేస్తానని ఇజ్రాయిల్ ప్రధాని ప్రతిపాదించారు. అయితే రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదా ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందచేయడంపై సంయమనం పాటించారు.
యూదుల మూకుమ్మడి మారణకాండపై భయాందోళనలు రేకెత్తించడానికి అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నానికి, పైగా ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో దాన్ని పోల్చడంపై ఇజ్రాయిల్ పార్లమెంట్ సభ్యుల నుండి తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది. యుద్ధమనేది ఎప్పుడూ భయంకరమైనదే, కానీ సాధారణంగా జరిగే యుద్ధానికి, గ్యాస్ చాంబర్లలో లక్షలాదిమంది యూదులను కడతేర్చడానికి చేసిన చర్యలను సరిపోల్చడమనేది కష్టంగా వుందని ఎంపి యువల్ స్టెయింటిజ్ వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా చరిత్రను వక్రీకరించడమేనని విమర్శించారు. కమ్యూనికేషన్ మంత్రి, న్యూ హోప్ ఎంపి యోజ్ హెండాల్ కూడా దీన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. అయితే జెలెన్స్కీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఉక్రెయిన్ ప్రజలకు చేయాల్సినంత సాయం చేస్తామని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని విదేశాంగ మంత్రి యార్ లపిద్ ట్వీట్ చేశారు.