Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్వాంగ్ జౌ : చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్ విమానం గ్వాంగ్ జౌ పర్వతాల్లో కూలిపోయింది. ఈ విమానంలో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కూలిన కొండ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా తెలియలేదు.
చైనీస్ ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకారం..
ఎంయూ 5735 విమానం కున్మింగ్ చాంగ్షురు విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు గ్వాంగ్జౌ చేరుకోవాల్సి ఉన్నది. అయితే నివేదికల ప్రకారం.. విమానం గమ్యానికి చేరుకునేలోపు ప్రమాదం జరిగింది.గ్వాంగ్ జౌలోని వుజౌ నగరానికి సమీపంలో వెళ్తున్న ఈ విమానం కేవలం రెండు నిమిషాల వ్యవధిలో 30,000 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. టేకాఫ్ అయిన 71 నిమిషాల తర్వాత ఈ విమానం ప్రమాదానికి గురైనట్టు చైనా ఏవియేషన్ అధికారులు ధ్రువీకరించారు. విమానం ల్యాండింగ్‌కు 43 నిమిషాల ముందు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆరున్నరేండ్లుగా ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించటానికి వినియోగిస్తున్నారు . ప్రమాదంపై చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విమానం పడిపోయిన వెంటనే మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల అడవి బూడిదగా మారిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విచారం వ్యక్తం చేశారు. సీఏఏసీ ఎమర్జెన్సీ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి రెస్క్యూ టీమ్‌ను పంపిందని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 15 భారీ విమాన ప్రమాదాలు
2021లో ప్రపంచవ్యాప్తంగా 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఇందులో మొత్తం 134 మరణాలు సంభవించాయి. 2021 జనవరి 9న ఇండోనేషియాలో శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ 737-500 కూలిపోగా..ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 61 మంది మరణించారు. 2010లో చైనాకు చెందిన హెనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంబ్రేయర్ ఈ-190 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 96 మంది ప్రయాణికుల్లో 44 మంది చనిపోయారు.