Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంక్షలు విధించిన దేశాలపై రష్యా ఆంక్షలు
- ఉక్రెయిన్ బయో ల్యాబ్‌ల్లో బైడెన్ కుమారుని ప్రమేయం
- అమెరికా వివరణ ఇవ్వాల్సిందేనన్న చైనా
మాస్కో, కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత మొదటిసారిగా ఇరు దేశాలు పరస్పరం ఖైదీలను మార్పిడి చేసుకున్నాయని ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ఇర్యానా వెరెషుక్ గురువారం తెలిపారు. ఉక్రెయిన్ బలగాల అధీనంలో వున్న పది మంది రష్యన్ సైనికులను విడిపించేందుకు ప్రతిగా రష్యా మిలటరీ ఉక్రెయిన్ ఖైదీలను విడుదల చేసిందని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీనికితోడు, ఒడెషా సమీపంలో మునిగిపోతున్న నౌక నుంచి కాపాడిన 11మంది రష్యన్ నావికులను కూడా ఉక్రెయిన్ అప్పగించింది. బదులుగా రష్యా 19మంది ఉక్రెయిన్ నావికులను విడుదల చేసిందని ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధాని చెప్పారు.
ఆంక్షలు విధించిన దేశాల ఆస్తులపై రష్యా ఆంక్షలు
ఉక్రెయిన్‌పై యుద్ధం జరుపుతున్నందుకు గానూ రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలకు నిధుల రాకపోకలపై రష్యా సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఆంక్షలు విధించింది. రష్యన్ రిజర్వ్‌లను పాక్షికంగా స్తంభింపజేయడానికి ప్రతిగా రష్యా కూడా ఆ దేశాలకు బదిలీచేసే నిధుల రాకపోకలపై ఆంక్షలు పెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ రష్యా వెబ్‌సైట్‌లోని ప్రకటన పేర్కొంది. పెట్టుబడుల కదలికలపై, విదేశీ ఇన్వెస్టర్ల సెక్యూరిటీల విక్రయంపై, ఆ ఇన్వెస్టర్లు రష్యా ఆర్థిక వ్యవస్థ నుంచి నిధులు తీసుకోవడంపై మొత్తంగా నిషేధం విధించినట్లు తెలిపింది. అదనంగా, రష్యన్ కంపెనీల కార్పొరేట్ రుణంపై చెల్లింపులు ఇకపై ప్రభుత్వ కమిషన్ అనుమతితోనే జరగాల్సి వుంటుంది.
ఉక్రెయిన్‌లో పెంటగన్ జీవాయుధాల కార్యక్రమానికి
బైడెన్ కుమారుని నిధులు !
ఉక్రెయిన్‌లో అమెరికా చేపట్టిన సైనిక జీవాయుధాల కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు ప్రమేయం వున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ప్రస్తుతం హంటర్ బైడెన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రోజ్మాంట్ సెనెకా పెంటగన్ చేపట్టిన బయోలాజికల్ ప్రోగ్రామ్‌కు నిధులు అందిస్తోందని పేర్కొంది. దాదాపు 240కోట్ల డాలర్ల మొత్తాన్ని అందచేసినట్లు రష్యా సాయుధ బలగాల రేడియేషన్, కెమికల్, బయోలాజికల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఇగర్ కిరిలోవ్ తెలిపారు. ఈ కార్యక్రమాల అభివృధ్ధిలో, నిధుల జారీలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ, జార్జి సోరోస్ ఫౌండేషన్, సిడిసిపిల పాత్ర కూడా వుందని చెప్పారు. అమెరికా ప్రభుత్వ సంస్థలకు, ఉక్రెయిన్ జీవాయుధాల కేంద్రాలకు మధ్య సంబంధముందని రుజువు చేసే పత్రాలు లభ్యమైనట్టు తెలిపారు. సైనిక అవసరాలకు ఉపయోగపడే జీవాయుధాల కార్యకలాపాలకు సంబంధించి 30 ఉక్రెయిన్ ల్యాబరేటరీలు పనిచేస్తున్నాయని తమవద్ద అధికారికంగా రుజువులు వున్నాయని రక్షణ శాఖ అధికారి చెప్పారు. ఉక్రెయిన్ నుండి 16వేల నమూనాలు అమెరికా, దాని మిత్ర దేశాలకు వెళ్లాయని కిరిలోవ్ తెలిపారు. కాగా దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.
బయో మిలటరీ కార్యకలాపాలపై వివరణ ఇవ్వాలి
ఉక్రెయిన్‌లో రహస్యంగా సాగుతున్న జీవ, రసాయన సౖౖెనికాయుధ కార్యకలాపాలపై అమెరికా అధికారులు వివరణ ఇవ్వాలని చైనా ప్రభుత్వం కోరింది. ఉక్రెయిన్‌లో, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న బయోలాజికల్ కార్యకలాపాలపై సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ కోరారు. ఉక్రెయిన్‌లో అమెరికా నిర్వహిస్తోన్న ఈ ల్యాబ్‌ల ప్రధాన లక్ష్యంపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు. దీనిపై మౌనం పాటించడం లేదా తప్పుడు సమాచారమంటూ కొట్టిపారేయడం ఇక ఎన్నాళ్లో సాగదని అన్నారు. ఇందుకు సంబంధించిన కేంద్రాలు, పత్రాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ సమాజాన్ని అనుమతిస్తేనే, అవసరమైన సమాచారాన్ని వెల్లడిస్తేనే అమెరికా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోగలదని అన్నారు.
ఏకధ్రువ ప్రపంచానికి ఇక చెల్లుచీటీ !
ఇక ఈ భూగోళంపై అమెరికన్లు మాస్టర్లుగా చెలామణి అవలేరని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ వ్యాఖ్యానించారు. ఏకధ్రువ ప్రపంచమన్న భావనకు ఇక చెల్లు చీటి పడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ కూడా అయిన మెద్వెదెవ్ తెలిపారు. ఆర్టి, స్పుత్నిక్లకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన వివిధ అంశాలపై స్పందించారు. పశ్చిమ దేశాల వ్యవహార శైలికి సంబంధించి ఇటీవలి కాలంలో మెద్వెదెవ్ కఠినమైన ప్రకటనలు జారీ చేస్తున్నారు.