Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు
- రష్యా ఆందోళనలు పరిష్కారమైతేనే ఒప్పందం : మాస్కో ప్రతినిధ బృంద నేత
కీవ్, మాస్కో : రష్యాతో జరిపే శాంతి చర్చల క్రమం చాలా క్లిష్టంగా వుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా వ్యాఖ్యానించారు. ''చర్చల క్రమం చాలా సంక్లిష్టంగా వుంది. అయినా ఉక్రెయిన్ ప్రతినిధి బృందం బలమైన వైఖరిని అనుసరిస్తోంది. తమ డిమాండ్లను వదులుకోవడం లేదు.'' అని కులేబా పేర్కొన్నారు. కాల్పులు విరమణ జరగాలని, భద్రతాపరమైన హామీలు ఇవ్వాలని, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతకు హామీ కలించాలని ఉక్రెయిన్ ప్రతినిధి బృందం పట్టుబడుతోందని ఆయన చెప్పారు. నాలుగు పాయింట్లపై రష్యా, ఉక్రెయిన్లు ఏకాభిప్రాయానికి వచ్చారని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైయీప్ ఎర్డోగన్ చేసిన ప్రకటనపై కులేబా వ్యాఖ్యానిస్తూ, కీలకమైన చర్చాంశాలను నాలుగు పాయింట్లుగా వర్గీకరించడం సరికాదని అన్నారు. అనేక భిన్నమైన అంశాలను ప్రతినిధుల బృందాల్లోని ఉప వర్గాలు చర్చిస్తున్నాయని తెలిపారు. ఉక్రెయిన్ గడ్డపై శాంతిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో టర్కీ, ఇతర దేశాలతో కీవ్ చర్చలు కొనసాగిస్తుందని చెప్పారు. గత వారంలో ఉక్రెయిన్, రష్యా ప్రతినిధి బృందాల మధ్య నాల్గో దఫా ఆన్లైన్ చర్చలు ప్రారంభమయ్యాయి.
రష్యా ఆందోళనలు పరిష్కారమవకపోతే ఒప్పందమే లేదు
రష్యా వెలిబుచ్చుతున్న ప్రధాన ఆందోళనలన్నీ పరిష్కారమైతేనే ఇరు పక్షాల మధ్య ఒప్పందమనేది కుదురుతుందని రష్యా ప్రతినిధి బృంద నేత వ్లాదిమిర్ మెదినిస్కీ శుక్రవారం వ్యాఖ్యానించారు. ''సమగ్ర ఒప్పందం కోసం మేం పట్టుబడుతున్నాం. ఉక్రెయిన్ తటస్థ దేశంగా వుండడం, ఆ దేశ భద్రతకు హామీలివ్వడంతో పాటుగా రష్యాకి సంబంధించిన కీలకమైన పలు వైఖరులు ఆ ఒప్పందంలో వుండాలి.'' అని ఆయన విలేకర్లతో అన్నారు. లేనిపక్షంలో ఒప్పందం కుదరడమనేది బహుశా వుండకపోవచ్చునని రష్యా అధ్యక్ష సలహాదారు, ప్రతినిధి బృంద నేత మెదినిస్కీ పేర్కొన్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరని పక్షంలో తృతీయ పక్షాల నుండి భద్రతా హామీలు పొందడం గురించే ఉక్రెయిన్ పక్షం ప్రధానంగా ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రస్తుతం సాగుతున్న చర్చల క్రమంలో అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యని, కానీ ప్రధానాంశాలపై చెప్పుకోదగ్గ పురోగతి లేదని అన్నారు. తృతీయ పక్షాలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా శాంతి చర్చలను ఉక్రెయిన్ పక్షం కావాలనే మందకొడిగా సాగిస్తోందని తాము భావిస్తున్నట్టు మెదిన్స్కీ వ్యాఖ్యానించారు.