Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా- ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి
- కీవ్ సమీపంలో దాడుల స్థాయి తగ్గిస్తాం
- టర్కీ శాంతి చర్చల్లో రష్యా ప్రతిపాదన
- నాటో తరహా ఒప్పందం కావాలంటున్న ఉక్రెయిన్
అంకారా : నెల రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో ఎట్టకేలకు శాంతి ఒప్పందం కుదిరే దిశగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. టర్కీ మధ్యవర్తిత్వంతో టర్కీ గడ్డపై తాజాగా జరిగిన శాంతి చర్చల్లో ఇరుపక్షాలు అర్థవంతంగా చర్చలు జరిపాయని రష్యా ప్రతినిధి బృంద నేత వ్లాదిమిర్ మెదిన్స్కీ చెప్పారు. సమావేశా నంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్ రాతపూర్వకంగా ప్రతిపాదన అందచేసిందని చెప్పారు. రష్యా కూడా దాడుల స్థాయిని తగ్గిస్తామని ప్రతిపాదించిందని తెలిపారు. ఈ చర్చల్లో ఉక్రెయిన్ బృందం చేసిన ప్రతిపాదనలను అధ్యక్షుడు పుతిన్‌కు నివేదించనున్నట్టు తెలిపారు.
ఈ శాంతి చర్చల ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
1. రష్యా దాడులు తగ్గాలి
రాజధాని కీవ్ సమీపంలో సహా ఉత్తర ఉక్రెయిన్‌లో తమ సైనిక కార్యకలాపాలను రష్యా గణనీయంగా తగ్గిస్తుందని మాస్కో ప్రతినిధి బృంద సభ్యులు తెలిపారు. ఉక్రెయిన్ తటస్థత, అణ్వస్త్రరహిత దేశంగా హోదాపై ఒప్పందం కుదుర్చుకునేందుకు జరుగుతున్న చర్చలు ఆచరణాత్మక పరిధిలోకి వచ్చాయని రష్యా డిప్యూటీ రక్షణమంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వ్యాఖ్యానించారు. కీవ్, చెర్నిహివ్ సమీప ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు కూడా అనేక రెట్లు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
2. నాటో తరహా భద్రతా హామీలు కావాలి
ఉక్రెయిన్ భద్రతకు తమకు అంతర్జాతీయ ఒప్పందం కావాలని ఉక్రెయిన్ ప్రతినిధి బృందం కోరింది. ఈ ఒప్పందం కింద ఇతర దేశాలు ఉక్రెయిన్ భద్రతకు హామీదారులుగా వుండాలని పేర్కొంటోంది. ''అంతర్జాతీయ యంత్రాంగంతో కూడిన భద్రతాపరమైన హామీలు మాకు కావాలి. నాటో నిబంధనావళిలోని ఐదవ అధికరణ తరహాలోనే, అంతకన్నా మరింత ధృడంగా మాకు హామీ కల్పించే దేశాలు వ్యవహరించాలి.'' అని ఉక్రెయిన్ ప్రతినిధి బృంద సభ్యుడు డేవిడ్ అర్కామియా అన్నారు. రష్యా ప్రతినిధి బృందంతో చర్చలనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రిటన్, చైనా, అమెరికా, టర్కీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, పోలాండ్, ఇజ్రాయిల్ దేశాలు అటువంటి హామీలు కల్పించాలని సూచించారు. వీటిల్లో కొన్ని దేశాలు ఇప్పటికే ప్రాథమిక అంగీకారాన్ని తెలిపాయన్నారు. రష్యా కూడా ఒక హామీదారుగా వుండాలన్నారు.
3.మిలటరీ బ్లాక్‌లు వుండరాదు, అణ్వస్త్ర రహిత దేశంగా ఉక్రెయిన్
ఏ మిలటరీ బ్లాక్‌లోనూ చేరబోమని ఉక్రెయిన్ ఆ రాతపూర్వక ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. అలాగే విదేశీ సైనిక స్థావరాలకు లేదా విదేశీ బలగాలకు ఆతిథ్యమివ్వమని పేర్కొందని మెదిన్స్కీ తెలిపారు.సైనిక విన్యాసాలకు కూడా గ్యారంటీదారు ల నుండి ముందుగా అనుమతి పొందాల్సి వుంటుంది. అణ్వాయుధాలతో సహా ప్రజా విధ్వంసక ఆయుధాలు కావాలని కోరబోమని తెలిపింది. ఇందు కు ప్రతిగా ఏదో ఒక రోజున ఇయులో ఉక్రెయిన్ చేరే విషయంలో రష్యా అభ్యంతరం పెట్టరాదు.
4.అపరిష్కృతంగా క్రిమియా, డాన్బాస్
ఉక్రెయిన్‌పై లేదా చీలిక ప్రాంతాలైన డాంటెస్క్, లుగాన్క్క్లపై సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నంలో సైనిక ప్రయోగానికి దిగబోమని కీవ్ హామీ ఇచ్చినట్టు మెదిన్స్కీ తెలిపారు. అయితే ఏ శాంతి ఒప్పందం తుది వర్షన్లోనైనా ఉక్రెయిన్ పదజాలాన్ని వుంచుతామని మాస్కో ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన నొక్కి చెప్పారు. క్రిమియాను తమ భూభాగంగా రష్యా పరిగణిస్తోంది. కీవ్ కూడా అలాగే గుర్తించాలని భావిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి ముందుగానే డాంటెస్క్, లుగాన్క్క్లను కూడా సార్వభౌమాధికార దేశాలుగా గుర్తించింది.
5. సరిహద్దులపై సందేహాలు
ఉక్రెయిన్ సరిహద్దులపై సందేహాలు ఇంకా మిగిలే వున్నాయి. డాంటెస్క్, లుగాన్క్క్లపై తమ హక్కును వదులుకుంటారా లేదా అనేది కీవ్ చెప్పలేదని మెదిన్స్కీ అన్నారు. ఫిబ్రవరికి ముందు డాంటెస్క్, లుగాన్క్క్ల్లో కొంత భాగం ఉక్రెయిన్ నియంత్రణలో వున్నా ఆ ప్రాంతాలు మొత్తంగా తమ భూభాగంగా పరిగణించేది. 1991లో స్వాతంత్య్రం ప్రకటించుకున్నపుడు ఏదైతే తమ అధీనంలో వుందో ఆ మొత్తం భూభాగంలో తమ సార్వభౌమాధికారం వుంటుందని ఉక్రెయిన్ బృంద నేత ఆర్కామియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు.
6. పుతిన్, జెలెన్స్కీ సమావేశానికి కొత్త షరతులు
కీవ్ చేసిన మరో ప్రతిపాదనను మాస్కో అంగీకరించింది. తుది దశ చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశం ఏర్పాటుచేయడానికి ఆమోదం తెలిపింది. తుది పత్రం ఖరారైన తర్వాత, ఆయా విదేశాంగ మంత్రుల సంతకాలు జరిగిన తర్వాతనే సమావేశం వుండగలదని గతంలో మాస్కో తెలిపింది. అయితే సాధ్యమైనంత త్వరలో ఈ సమావేశం జరిగితే తీర్మానం అమలు వేగవంతమవుతుందని పేర్కొంది.