Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది గంటలు పవర్ కట్
- అత్యవసరాలు, నిత్యావసరాలు అన్నీ కొరతే..
జయవర్ధనెపుర : దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సింహాదేశమైన శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ కోతలను విధించింది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ పది గంటల పవర్ కట్‌ను బుధవారం నుంచి అమలు చేసింది. మార్చి నెల ప్రారంభం నుంచి ఈ విద్యుత్ కోతలు రోజుకు ఏడు గంటలుగా ఉండేది. అయితే, దీనిని ఇప్పుడు మరో మూడు గంటలు పెంచి పది గంటలుగా చేసింది అక్కడి ప్రభుత్వం. దేశంలో థర్మల్ పవర్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇంధనం అందుబాటులో లేకపోవడంతో 750 మెగావాట్ల విద్యుత్ కొరత ఉన్నదని ఆ దేశ పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ చైర్మెన్ జనక రత్నాయక తెలిపారు. ప్రభుత్వం త్వరలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఎల్ఐఓసీ వద్ద కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. తగినంత వర్షపాతం లేకపోవడంతో దేశంలోని అనేక వాటర్ రిజర్వాయర్లు దారుణస్థితికి చేరుకున్నాయని అక్కడి అధికారులు వివరించారు. కాగా శ్రీలంకకు తక్షణ సాయం చేయనున్నట్టు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఏడు దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చవిచూడలేదని లంకేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక సంక్షోభం
పెట్రోల్ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు.. ఆస్పత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. విద్యుద్దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దశ్యాలివే. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేళం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసరాలు, నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కొరత ఏర్పడింది. సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్ వరకూ అన్ని వస్తువుల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్ కొరతతో విద్యా సంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్ పండగ నాడు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి.