Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు
- పోరాడుతున్న 170 అగ్నిమాపక యంత్రాలు
- ఉక్రెయిన్ మొదటి వైమానిక దాడిని ప్రకటించిన రష్యా
మాస్కో, కీవ్ : పశ్చిమ రష్యాలోని బెల్గోరాడ్ పట్టణంలో గల ఇంధన నిల్వ డిపోపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు బాంబు దాడులు జరిపాయని, దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాంతీయ గవర్నర్ శుక్రవారం తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తమ గడ్డపై కీవ్ వైమానిక దాడి జరిపిందంటూ మొట్టమొదటిసారిగా రష్యా ఇప్పుడు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఇప్పటికి 37 రోజులు గడిచింది. వేలాదిమంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చెలరేగిన అత్యంత అధ్వానమైన శరణార్దుల సంక్షోభంలో ఇప్పటివరకు కోటి మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఉక్రెయిన్‌కు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు జరిపిన వైమానిక దాడితో పెట్రోల్ డిపోలో మంటలు చెలరేగాయని బెల్గొరాడ్ ప్రాంత గవర్నర్ గ్లాద్కోవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. తక్కువ ఎత్తులో రష్యా భూభాగంలోకి ఈ హెలికాప్టర్లు ప్రవేశించి తమ పని పూర్తి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారని తెలిపారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో దాదాపు 170 అగ్నిమాపక యంత్రాలు మంటలతో పోరాడుతున్నాయి. దట్టమైన నల్లని పొగ ఆకాశాన్ని కప్పేయడం వీడియోలో కనిపిస్తోంది. ఉదయం 6గంటలకు జరిగిన ఈ దాడిని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రష్యా ఇంధన సంస్థ రాస్నెఫ్ట్కి చెందిన ఈ డిపో సముదాయం నుంచి వెంటనే సిబ్బందిని తరలించారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. తగిన మొత్తంలో పెట్రోల్ వుందని, ఎవరూ భయాందోళనలతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరపవద్దని గవర్నర్ ప్రజలను కోరారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఇంధన సమస్యలుండవని అన్నారు. ఈ వారం ప్రారంభంలో కూడా ఇదే పట్టణంలోని ఆయుధాల డిపో వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కానీ అధికారులు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.