Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంలో 50లక్షల మందికి వైరస్
లండన్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ మహమ్మారి ప్రస్తుతం బ్రిటన్ను వణికిస్తోంది. గడిచిన వారంరోజుల్లో దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కోవిడ్ బారిన పడినట్టు బ్రిటన్ అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. గడిచిన వారంలో ఏకంగా 4.9 మిలియన్ల (49లక్షలు) మంది వైరస్‌కు గురైనట్టు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంతకుముందు వారం 4.3 మిలియన్ల మందికి కరోనా సోకింది.
ముఖ్యంగా ఒమిక్రాన్ ఉపవేరియంట్ అయిన బీఏ.2 ప్రస్తుతం బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా తీవ్ర విజంభణతో బ్రిటన్ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాల రేటు తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే.. మృతుల సంఖ్య తక్కువగానే ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే తాజా కేసుల పెరుగుదలకు ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అన్ని రకాల కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ తర్వాత కోవిడ్ కేసులు మళ్లీ పెరిగినట్టు తెలుస్తోంది.