Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలు నిర్వహించాలని కోరిన ఇమ్రాన్‌ఖాన్
- అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ ఆమోదముద్ర
- అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
- ప్రభుత్వాన్ని మార్చాలనే కుట్ర భగమైంది : ఇమ్రాన్‌ఖాన్
- సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న ప్రతిపక్షాలు
ఇస్లామాబాద్ : ఆదివారం కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకున్నాయి. మరికొద్ది గంటల్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుందనగా, అవిశ్వాస తీర్మానాన్నే తిరస్కరిస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ ప్రకటించటం, ఆ వెంటనే పాక్ జాతినుద్దేశిస్తూ ప్రసంగించిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్..జాతీయ అసెంబ్లీని రద్దు చేయటం వెంట వెంటనే జరిగిపోయాయి. అంతేగాక ఆయన సూచనకు అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ ఆమోదముద్ర వేశారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఫ్రెష్‌గా..ఎన్నికలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఈమొత్తం పరిణామాలపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిపాయి.
అంచనాలు తలకిందులు
అవిశ్వాస తీర్మానంలో ఎలాంటి ఫలితం వస్తుందా? అని అందరూ ఎదురుచూడగా, అసలు అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేకుండా ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. చివరి నిమిషంలో స్పీకర్ అసద్ ఖైసర్‌పైనా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో సూరీ సభకు అధ్యక్షత వహించారు. సభలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ లేకపోవడం గమనార్హం. సభాపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దాంతోసభ వాయిదా పడింది. తీర్మానాన్ని తిరస్కరించినట్టు తెలిసిన కొన్ని నిమిషాల్లోనే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సిఫార్సు చేసినట్టు ప్రకటించారు. కొత్తగా ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని సూచించినట్టు తెలిపారు. పాక్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న విదేశీ కుట్రలను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అందుకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రతిపక్షాలు ఖర్చు చేశాయని ఆరోపించారు.
డబ్బులు తీసుకున్నవారు వాటిని అనాథలు, పేదలకు పంచిపెట్టాలని హితవు పలికారు. పాక్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. యావత్తు దేశం గమనిస్తుండగా దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి శక్తులకు దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేస్తే తర్వాతి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. అయితే తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించాయి.
సుప్రీంకోర్టుకు..బంతి
జాతీయ అసెంబ్లీ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో జర్దారీ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా చేసిన ఇమ్రాన్ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా అన్ని వ్యవస్థల తలపులు తడుతామన్నారు. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా మమన్న ఆయన..ఈకేసును ఈరోజే విచారించాలని కోరుతామని వివరించారు. ఈ విషయంలో విపక్ష పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయని జర్దారీ స్పష్టం చేశారు.
పాక్ అటార్నీ జనరల్ రాజీనామా
తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పాక్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల ధర్మాసనం విచారిస్తోంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆది వారం జరిగిన పరిణామాలన్నీ గమనించాలని ప్రతిపక్షాలు కోరాయి. పిటిషన్‌పై మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడ వచ్చునని తెలిసింది. మరోవైపు పాక్ అటార్నీ జనరల్ రాజీ నామా చేయడం కలకలం రేపింది. డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడానికి నిరసనగా ఈ రాజీనామా చేశారని సమాచారం. మరోవైపు ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి షాబాజ్ షరీఫ్‌కు మాక్ ఓటింగ్‌లో 195 ఓట్లు లభించాయి. 342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ 'తెహ్రీక్ ఏ ఇన్సాఫ్' (పీటీఐ) పార్టీకి 155మంది సభ్యులున్నారు. పీఎంఎల్ క్యూ సహా ఇతరుల మద్దతుతో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య 164కు చేరింది. వాస్తవానికి మ్యాజిక్ నెంబర్ 172. ప్రతిపక్ష పీఎంఎల్ఎన్-84, పీపీపీ-56, ఎంఎంఏకు 15 మంది, ఇతరులు 22మంది ఉన్నారు. వీరందరి బలం 177. మ్యాజిక్ ఫిగర్ మించి ప్రతిపక్షాల వద్ద బలముంది.