Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకలాపాల రికార్డు ఇవ్వాలని కోరిన పాక్ సుప్రీం కోర్టు
- స్పీకర్ చర్య చట్టబద్ధమా కాదా అనేదే తేలుస్తామని స్పష్టీకరణ
ఇస్లామాబాద్ : ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాఖలైన అవిశ్వాస తీర్మానంపై నేషనల్ అసెంబ్లీలో జరిగిన కార్యకలాపాల రికార్డును అందచేయాల్సిందిగా పాకిస్తాన్ సుప్రీం కోర్టు మంగళవారం కోరింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను నిలువరిస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌లో చట్టబద్ధత వుందా లేదా అనే అంశంపై విచారణ జరిపిన కోర్టు, పార్లమెంట్ రికార్డును కోరిన తర్వాత బుధవారం వరకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బందియల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయడానికి, తదనంతరం నేషనల్ అసెంబ్లీని రద్దు చేయడానికి డిప్యూటీ స్పీకర్ తీసుకున్న చర్యలు రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతాయా లేదా అని మాత్రమే తాము నిర్ధారిస్తామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. స్పీకర్ చర్య చట్టబద్ధతను మాత్రమే కోర్టు నిర్ణయిస్తుందన్నారు. ఇదే అంశంపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా తాము అన్ని పక్షాలను కోరనున్నామని చెప్పారు. కాగావిచారణ ప్రారంభం కాగానే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనెటర్ రజా రబ్బాని, సీనియర్ న్యాయవాది మక్దూమ్ అలీ ఖాన్లు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు ఇమ్యూనిటీ పరిధిని కోర్టు విచారించాల్సి వుందని రబ్బాని అన్నారు. స్పీకర్ చర్యను చట్ట వ్యతిరేకమని ఆయన పేర్కొంటున్నారు. ఓటింగ్ జరగకుండా అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చలేరని అన్నారు. రాజ్యాంగంలోని 95వ అధికరణను ఈ సందర్భంగా ఉదహరించారు. పిఎంఎల్-ఎన్ తరపు న్యాయవాది మక్దూమ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, 152మంది సంతకాలతో అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌కు అందచేశామని, దీన్ని ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 161మంది ఓటు వేశారని, అంతా అయిన తర్వాత దానిపై కార్యకలాపాలను మార్చి 31కి వాయిదా వేశారని చెప్పారు. ఆతర్వాత అనుకున్నట్లుగా చర్చ జరగలేదని, ఏప్రిల్ 3న ఓటింగ్ కూడా జరగలేదని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా రూలింగ్ వస్తే, 90రోజుల్లోగా ఎన్నికలు జరుగుతాయి. డిప్యూటీ స్పీకర్ చర్యకు వ్యతిరేకంగా కోర్టు రూలింగ్ ఇస్తే పార్లమెంట్‌ను తిరిగి సమావేశపరిచి, అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటింగ్ నిర్వహించాలని నిపుణులు పేర్కొంటున్నారు.