Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యాన్ని దింపిన చైనా
బీజింగ్ (చైనా) : కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొద్దిరోజులుగా చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 13 వేలకుపైగా కేసులు నమోదవ్వగా, వాటిలో దాదాపు 9 వేల కేసులు ఒక్క షాంఘై నగరంలోనే నమోదవ్వడం గమనార్హం. షాంఘైలో కరోనా విజంభిస్తోంది. దేశంలో కోవిడ్ నియంత్రణకుగాను డ్రాగన్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది.
ఎత్తున దిగిన ఆరోగ్య కార్యకర్తలు- ఆర్మీ-నేవీ సిబ్బంది
చైనాలో అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్ వ్యాపిస్తోన్న వేళ.. దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. షాంఘైలో వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. కోవిడ్ పరీక్షలను పెంచడంతోపాటు నగరానికి పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలను, సైన్యాన్ని పంపింది.
ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2 వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దీంతో పాటు దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందిని షాంఘైకి తరలించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. షాంఘై పొరుగున ఉన్న జియాంగ్జు, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల నుంచి ఈ సిబ్బందిని నగరానికి పంపించారు.
ఆఫీసుల్లోనే తిండి, నిద్ర..
కోవిడ్ వైరస్ గొలుసును తెంచేందుకుగాను చైనా ప్రభుత్వం షాంఘైలో కఠినంగా లాక్డౌన్ను అమలుచేస్తోంది. క్లోజ్డ్ లూప్ వ్యూహంతో కొన్ని అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అధికారులు అనుమతినిచ్చారు. దీంతో ఆయా కంపెనీల సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆఫీసుల్లోనే నిర్బంధంలో పనిచేస్తున్నారు. వాణిజ్య పరిశ్రమకు చెందిన వేలాది మంది స్టాక్ ట్రేడర్లు, ఇతర ఉద్యోగులు తమ తమ ఆఫీసుల్లోనే నిద్ర పోతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రతీ పౌరుడికి ట్విన్ కోవిడ్ పరీక్షలు..
షాంఘై నగరంలో గతవారమే ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కఠినమైన లాక్డౌన్ విధించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సోమవారం నుంచి ట్విన్ కోవిడ్ పరీక్షలు మొదలుపెట్టారు. అంటే నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేస్తున్నారు.