Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్తాన్ ఎన్నికల సంఘం
ఇస్లామాబాద్ : మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని పాకిస్తాన్ ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశ ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్ సవాళ్ల కారణంగా ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని స్పష్టం చేసింది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ముఖ్యంగా కైబర్ పక్తూంక్వాలో నియోజకవర్గాలు పెరగబోతుండటం, జిల్లా, నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం వంటి ప్రధాన సవాళ్ల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సుమారు ఆరు నెలల సమయం పడుతుందని ఆ దేశ ఎన్నికల అధికారి ఒకరు చెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందనీ, చట్ట ప్రకారం అభ్యంతరాలను తెలపడానికి ఒక నెల సమయం ఇవ్వాలన్నారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, ఎన్నికల షెడ్యూలును నాలుగు నెలల ముందుగా ప్రకటించవలసి ఉంటుందని అన్నారు. అలాగే ఎలక్షన్ మెటీరియల్‌ను సేకరించడం, బ్యాలట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సిబ్బందికి శిక్షణకు కొంత సమయం పడుతుందని దీంతో మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు. గవర్నమెంట్ ఎన్నికలు మే 29న జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రస్తుతం పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ లోకల్ గవర్నమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటును రద్దు చేయాలని, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్‌ఖాన్ ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి సిఫారసు చేశారు. అయితే కాసేపటికే నేషనల్ అసెంబ్లీని రద్దు చేసినట్లు అల్వీ ప్రకటించారు. కాగా, అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.