Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో మెజారిటీ కోల్పోయిన అధ్యక్షుడు
కొలంబో : శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. ఆర్థిక సంక్షోభంతో ఆహారం, పెట్రోల్‌తో పాటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. క్యూల్లో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ పెట్రోల్ లభించడం లేదని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. గత కొన్నిరోజులుగా ప్రధాని మహేంద్ర రాజపక్సా నివాసం ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. కర్ఫ్యూ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ.. నిరసనకారులు భారీ ర్యాలీ చేపట్టారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సా అధికార కూటమి నుంచి మిత్రపక్షాలు వైదొలగడంతో పార్లమెంటులో ఆయన మెజారిటీని కోల్పోయారు. అధికార శ్రీలంక పోడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నామని 42 మంది ఎంపీలు మంగళవారం ప్రకటించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్రపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని ఫ్రీడమ్ పార్టీ నేత మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. కాగా, రాజపక్స మినహా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేవలం నలుగురు మంత్రులను మాత్రమే కొనసాగిస్తున్నట్టు వెల్లడించిన గొటబయ... సోమవారం తన సోదరుడు, ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సను కూడా పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో అలీ సర్బీకి ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సోమవారం వెల్లడించారు. అయితే ఈ పదవి చేపట్టిన 24 గంటల్లోపే సర్బీ రాజీనామా చేయడం గమనార్హం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాను ఆర్థిక మంత్రిగా కొనసాగలేననీ, ఆ స్థానంలో మరో ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించాలని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటడంతో ఆస్ట్రేలియా, నార్వే, ఇరాక్ దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మాసివేశాయి.