Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు
- 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్
- డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వ్యాఖ్య
- పాక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి సమన్లు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పార్లమెంట్‌ను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను తిరస్కరిస్తూ, తదనంతరం పార్లమెంట్‌ను రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ డాక్టర్ అరిఫ్ అల్వీ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని సుప్రీం స్పష్టం చేసింది. శనివారం ఉదయం 10.30గంటలకు నేషనల్ అసెంబ్లీ సమావేశమవ్వాలని కోర్టు ఆదేశించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండా సమావేశం వాయిదా పడరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు పాల్గొనే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని పేర్కొంది. అనుకున్న దానికన్నా గంట ఆలస్యంగా తీర్పు వెలువడింది.
డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారా లేదా అనే అంశంపై పాక్ సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రాధమిక సాక్ష్యాధారాలను బట్టి చూసినట్లైతే రాజ్యాంగంలోని 95వ అధికరణను డిప్యూటీ స్పీకర్ ఉల్లంఘించారని తెలుస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బండియల్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 3నాటి రూలింగ్ తప్పని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏం జరగాలన్నది ఇప్పుడు మన ముందున్న సమస్య అని వ్యాఖ్యానించారు. ఈలోగా తీర్పు ఇవ్వడానికి ముందుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి సమన్లు జారీ చేశారు.
డిప్యూటీ స్పీకర్ తీసుకున్న చర్య వల్ల ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్‌ను రద్దు చేసి, ఎన్నికలకు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం కలిగింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగి వుంటే ఇమ్రాన్ ఖాన్ కచ్చితంగా ఓడిపోయి గద్దె దిగాల్సి వచ్చేది. 90రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటూ ఎన్నికల కమిషన్ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కి సమన్లు అందాయి. తీర్పు వెలువడే సమయం దగ్గర పడుతున్న కొద్దీ కోర్టు వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
నో కామెంట్ : భారత్
పాక్‌లోని సంక్షుభిత పరిస్థితుల పట్ల వ్యాఖ్యానించడానికి భారత్ తిరస్కరించింది. అది వారి అంతర్గత విషయమని వ్యాఖ్యానించింది. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి తెలిపారు.