Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది మృతి,వందమందికి పైగా గాయాలు
- రష్యా దాడిచేసిందన్న ఉక్రెయిన్ అధికారులు
- ఖండించిన రష్యా
కీవ్ : తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలోని క్రమాటోర్స్క్ నగరంలోని ఒక రైల్వే స్టేషన్‌పై శుక్రవారం జరిగిన రాకెట్ దాడిలో ఐదుగురు పిల్లలుసహా 50 మంది మృతి చెందగా, వందమందికిపైగా గాయపడ్డారు. ఆ పట్టణం నుంచి వెళ్లిపోయేందుకు వందలాదిమంది ఈ రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. స్టేషన్ రద్దీగా ఉండటంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాడి తరువాత స్టేషన్ బీభత్సంగా మారింది. మృతదేహాలు, రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ దాడిలో నలుగురు పిల్లలతో 39 మంది మరణిచారని ఉక్రెయిన్‌కు చెందిన ఎస్బియు సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. రష్యా దళాలే ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపించింది. ఈ దాడి గురించి ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ మాట్లాడుతూ 'ఇది హద్దులు లేని దుర్మార్గం. శిక్షించకపోతే ఎప్పటికీ ఆగదు' అని అన్నారు.
ఆ క్షిపణులు ఉక్రెయిన్‌వే : రష్యా
రైల్వే స్టేషన్‌పై రష్యా దాడి చేసిందనే ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. క్రమాటోర్స్క్ నగరంలో తమ సైన్యం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, రెచ్చగొట్టేవని విమర్శించింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాల ద్వారా దాడిలో పాల్గొన్న క్షిపణులు ఇస్కాండర్ లేదా టోచ్కా యు గా తెలుస్తుందని, ఇవన్నీ ఉక్రెయిన్ దళాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని తెలిపింది. ఇదే తరహా క్షిపణి మార్చి 14న డోనెట్స్క్ నగరాన్ని తాకిందని పేర్కొంది. ఉక్రెయిన్ అధికారులు ఎలాంటి ఆధారాలు చూపకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా పేర్కొంది. సైనిక చర్యలో భాగంగా ఉక్రెయిన్‌లోని ఒడెస్సాకు ఈశాన్యంలోని క్రాస్నోసిల్కా సమీపంలోనిఒక విదేశీ కిరాయి సైనికుల శిక్షణా కేంద్రాన్ని క్షిపణులతో ధ్వంసం చేసినట్లు రష్యా శుక్రవారం తెలిపింది.