Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ అసెంబ్లీలో రగడ
- ఓటింగ్ చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్
- విదేశీ కుట్రపై చర్చ జరగాలని అధికార పక్షం పట్టు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. శనివారం రాత్రి ఇఫ్తార్ విరామం తర్వాత జాతీయ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టనున్నదని తెలిసింది. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలతో పాటుగా సొంతపార్టీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు స్పీకర్ అంగీకరించలేదు. మరోవైపు తీర్మానాన్ని చేపట్టి..ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ అసద్ కైసర్ పలుమార్లు వాయిదా వేశారు. మొత్తం 342 సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే, తీర్మానానికి అనుకూలంగా కనీసం 172మంది సభ్యులు మద్దతు పలకాలి. ఇదిలా ఉండగా శనివారం రాత్రి పాక్ కేబినెట్ అత్యవసర సమావేశానికి ఇమ్రాన్‌ఖాన్ ఏర్పాట్లు చేశారు. ఈ భేటీకి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు జాతీయ అసెంబ్లీ శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ వెంటనే అవిశ్వాస తీర్మానంపై ఓటంగ్ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే దీన్ని అధికార పక్షం వ్యతిరేకించింది. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. జాతీయ అసెంబ్లీ సభ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..''సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని భావిస్తున్నాం. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని కోరుతున్నా''మని అన్నారు.
దీనికి స్పీకర్ అసద్ కైసర్ స్పందిస్తూ..పాక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణలపై చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. దీన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. ఎలాంటి చర్చ జరపాల్సిన అవసరం లేదని, వెంటనే ఓటింగ్ చేపట్టాలని పట్టుబట్టాయి. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి, పీటీఐ నేత షా మహ్మద్ ఖురేషీ మాట్లాడుతూ, విదేశీ కుట్రపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సభలో వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. చర్చకు స్పీకర్, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విదేశీ కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై చర్చ జరపాలని స్పీకర్ భావించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అధికార పీటీఐ ఉద్దేశపూ ర్వకంగానే ఓటింగ్ ఆలస్యం అయ్యేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాజీనామా తప్పదా!
జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ప్రతిక్షాలన్నీ హాజరయ్యాయి. కానీ అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు హాజరు కాలేదు. ఇందులో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ కూడా ఉన్నారు. శనివారంనాటి సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పీటీఐ నుంచి కేవలం 51మంది సభ్యులు మాత్రమే హాజరవ్వడం గమనార్హం. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సభ్యులున్నారు. అవిశ్వాసంపై ప్రతిపక్షాలు నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 164గా ఉండగా, విపక్షాల సంఖ్యాబలం 177గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్ అవిశ్వాసం నుంచి గట్టెక్కే అవకాశాలు కన్పించడం లేదు. దాంతో ఓటింగ్‌కు ముందే ఆయన రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఓటింగ్ వాయిదా పడేలా అధికార పక్షం ప్రయత్నాలు చేస్తోంది.