Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తదుపరి ప్రధానిగా ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ (70) ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. మరోవైపు పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది. శనివారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన మొదటి ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ నిలవడం గమనార్హం. తాను జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయనున్నట్టు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. అసెంబ్లీలో దొంగలతో పాటు తాను కూర్చోలేనని ఆయన అన్నారు. వరుసగా రూ.1600 కోట్ల, రూ.800 కోట్ల అవినీతి కేసులు ఉన్న వ్యక్తిని నూతన ప్రధానిగా ఎన్నుకున్నారనీ, ఇంతకంటే దేశానికి పెద్ద అవమానం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలతో కూర్చోవడం తనకు ఇష్టం లేదనీ, అందుకే తాము జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయనున్నామని ఇమ్రాన్ ట్విటర్లో పేర్కొన్నారు. తనతో పాటు తన పార్టీ సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మాజీ అంతర్గత మంత్రి షేక్ రషీద్ ధ్రువీకరించారు. గతవారం పెషావర్ సందర్శన సమయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ తన సూచనను సమర్థించారని అన్నారు. తాము అసెంబ్లీలో కొనసాగితే ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్‌కి మద్దతిచ్చినట్లే ననీ, అందుకే తాము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. విదేశీ కుట్రకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ప్రతి ఆదివారం ప్రజలకు పిలుపునివ్వనున్నారని రషీద్ తెలిపారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్కి చెందిన మురద్ సయీద్ జాతీయ అసెంబ్లీకి రాజీనామా సమర్పించిన మొదటి సభ్యురాలని స్థానిక మీడియా పేర్కొంది.