Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా, రష్యా యుద్ధం కారణమంటున్న నిపుణులు
- అమెరికాలోనూ 40ఏండ్ల కాలంలో లేని రీతిలో పెరుగుదల
లండన్ : బ్రిటన్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత 30ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో వినిమయ ధరలు పెరిగాయి. ఇంధన, మోటారు ఇంధనాలకు అవుతున్న ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావం నిత్యావసరాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్చితో ముగిసిన గత 12మాసాల కాలంలో బ్రిటన్లో ద్రవ్యోల్బణం 7శాతానికి చేరింది. 1992 మార్చి తర్వాత ఇంత అధికం వుండడం ఇదే ప్రధమమని జాతీయ గణాంక విభాగ కార్యాలయం తెలిపింది. ఇంధన వ్యయం పెరగడం, ఆహార ధరలు ఆకాశాన్నంటడం, అధిక పన్నులు ఇవన్నీ కలిసి పెరిగిన వేతనాల ప్రభావాన్ని కప్పిపుచ్చుతున్నాయి. పైగా 1950వ దశకం తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు ఇంతలా దిగజారడం కూడా ఇదే కానుంది. కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాని నుంచి పూర్తిగా తేరుకోకముందే ఉక్రెయిన్లో రష్యా యుద్ధం పరిస్థితులను మరింత దిగజార్చింది. ఈ యుద్ధ కారణంగా ఇంధన ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో వాటి ప్రభావం మిగిలిన అన్నింటిపై పడింది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే అమెరికాలో గతనెల వినిమయ ధరలు 8.5శాతం పెరిగాయి. 40ఏండ్ల కాలంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు చాలా వేగంగా పెరిగాయని అమెరికా కార్మిక శాఖ మంగళవారం తెలిపింది. యురో ఉపయోగించే 19యురోపియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం గత నెల్లో 7.5శాతం పెరిగింది. వరుసగా ఐదు మాసాల నుంచి రికార్డు స్థాయిలోనే నమోదవుతోంది. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా గ్యాస్, విద్యుత్ బిల్లులను 54శాతం పెంచుకోవడానికి బ్రిటన్ ఇంధన నియంత్రణా సంస్థ అనుమతివ్వడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి.