Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై అమెరికాను హెచ్చరించిన రష్యా
- సముద్రంలో మునిగిన రష్యా యుద్ధనౌక
- పేలుడు కారణమంటున్న రష్యా, తామే పేల్చివేశామంటున్న ఉక్రెయిన్
మాస్కో : ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే అనూహ్యమైన పర్యవసానాలు ఎదురవుతాయని అమెరికాను రష్యా శుక్రవారం హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఇప్పటికి 50రోజులు పూర్తయ్యాయి. ''ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఆయుధాలను, సైనిక పరికరాలను అమెరికా పెద్ద ఎత్తున అందచేస్తున్న నేపథ్యంలో రష్యా ఆందోళనలు'' అన్న శీర్షికతో వున్న డాక్యుమెంట్‌ను వాషింగ్టన్‌లోని రష్యా ఎంబసీ, అమెరికా విదేశాంగ శాఖకు పంపిందని వాషిగ్టన్ పోస్ట్ పేర్కొంది. మల్టిపుల్ రాకెట్ లాంచరన్లను అత్యంత సున్నితమైన ఆయుధాలుగా మాస్కో గుర్తించినట్లు ఆ డాక్యుమెంట్ పేర్కొంది. అయితే అమెరికా, నాటో మిత్ర దేశాలు ఆ ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందచేశారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ఆయుధాలను బదిలీ చేయడానికి సంబంధించిన కఠినమైన నిబంధనలను నాటోమిత్రపక్షాలు ఉల్లంఘిస్తున్నాయని రష్యా ఆరోపించినట్లు వాషింగ్టప్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ''బాధ్యతారాహిత్యంగా ఉక్రెయిన్ను ఇలా సైనికీకరణ చేయడాన్ని ఆపాలంటూ అమెరికా, దాని మిత్రపక్షాలను కోరుతున్నాం'' అని ఆ నోట్ పేర్కొంది. ఈ సరఫరా ఇలాగే కొనసాగితే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించి అనూహ్యమైన పర్యవసానాలు ఎదురవుతాయని హెచ్చరించింది. తీవ్రమైన జాతీయవాదులుగా రష్యా పేర్కొంటున్న తీవ్రవాదులు, బందిపోటు శక్తుల చేతుల్లో ఈ అత్యంత శక్తివంతమైన ఆయుధాలు పడే ముప్పు వుందని తెలిసినప్పటికీ నాటో మిత్రపక్షాలు వాటిని పట్టించుకోవడం లేదని ఆ నోట్ పేర్కొంది. పైగా రష్యాకు ఎలాంటి సైనిక, సాంకేతిక సహకారాన్ని అందించవద్దంటూ ఇతర దేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోందని ఆ డాక్యుమెంట్ ఆరోపించింది. నల్ల సముద్రంలోని నావికాదళంలో అత్యంత కీలకమైన యుద్ధ నౌకను రష్యా నష్టపోయిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడడం గమనార్హం. తీర ప్రాంతం నుండి ప్రయోగించిన క్షిపణులతో క్రూయిజర్ మాస్కోవా నౌకపై దాడి చేశామని ఉక్రెయిన్ తెలిపింది. అత్యంత శక్తివంతమైన పేలుడు కారణంగా చెలరేగిన మంటలతో సముద్రంలో నౌక మునిగిపోయిందని రష్యా చెబుతోంది.
సముద్రంలో మునిగిన రష్యా యుద్ధనౌక
నల్లసముద్రంలోని రష్యా నావికా దళానికి చెందిన యుద్ధనౌక క్రూయిజర్ మాస్కోవా అత్యంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో సముద్రంలో మునిగిపోయిందని రష్యా రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. తీవ్రమైన పేలుడు పదార్ధాల విస్ఫోటనం కారణంగా బుధవారం యుద్ధనౌక ధ్వంసమైందని తెలిపింది. అయితే, తామే ఆ యుద్ధ నౌకను నౌక విధ్వంసక క్షిపణులతో ముంచివేశామని ఉక్రెయిన్ చెబుతోంది. అయితే పెంటగన్ ఇంకా ఆ వార్తను ధృవీకరించలేదు. ఆ క్రూయిజర్‌పై అమెరికా ద్రోణ్ గురువారం చక్కర్లు కొడుతోంది. ''ఓడరేవులో నిర్దిష్టప్రాంతంలో లంగరు వేయడానికి ప్రయత్నిస్తుండగా, పేలుడు వల్ల చుక్కాని దెబ్బతినడంతో నౌక మునిగిపోయిందని రక్షణ శాఖ ప్రకటించింది. ఒడెసాకి దక్షిణంగా 90కిలోమీటర్ల దూరంలో నౌక వుండగా నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలేగాయి. దీనివల్ల నౌకలోని ఆయుధాగారంలో పేలుళ్లు సంభవించాయని మిలటరీ తెలిపింది. నావికా సిబ్బందిని వెంటనే సురక్షితంగా తరలించారు. తొలుత మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామని రష్యా మిలటరీ ప్రకటించింది. క్రూయిజర్‌ను మరమ్మత్తుల నిమిత్తం క్రిమియాకు తీసుకెళుతున్నామని చెప్పింది. అయితే ఆ తర్వాత జరిగిన పత్రికా సమావేశంలో తిరిగి ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.