Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20మంది పాలస్తీనియన్లకు గాయాలు
జెరూసలేం : అల్ అక్సా మసీదు ఆవరణపై ఇజ్రాయిల్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 20మంది పాల్తీనియన్లు గాయపడ్డారని వైద్య బృందాలు తెలిపాయి. రంజాన్ ప్రారంభమైన తర్వాత జరిగిన మొదటి దాడి ఇదే. శుక్రవారం తెల్లవారు జామునకు ముందుగానే ఇజ్రాయిలీ పోలీసులు మసీదు ఆవరణలోకి ప్రవేశించారని, అప్పటికే ప్రార్ధనల కోసం వేలాదిమంది మసీదులో వున్నారని మసీదును నిర్వహిస్తున్న ఇస్లామిక్ ఎండోమెంట్ తెలిపింది. కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు గాయపడిన 20మందిని జెరూసలేంలోని ఆస్పత్రులకు తీసుకెళ్ళినట్లు పాలస్తీనా రెడ్ క్రీసెంట్ తెలిపింది. ఆ ప్రాంతంలో ఇంకా చాలామంది గాయపడి వున్నారని, ముగ్గురు అధికారులకు కూడా గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. ఉదయ ప్రార్ధనల సందర్భంగా హింస్మాతకంగా మారిన మూకలను చెరదగొట్టేందుకు తాము మసీదులోకి వెళ్ళాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. డజన్ల సంఖ్యలో ముసుగులు వేసుకున్న వారు అల్ అక్సామసీదులోకి చొరబడ్డారని, యూదులు ప్రార్ధన చేసుకునే పవిత్ర స్థలంగా భావించే గోడపై రాళ్లు విసిరారని పోలీసులు తెలిపారు. దీంతో రాళ్ళు విసిరే కొంతమంది పాలస్తీనా ఆందోళనకారులపై ఇజ్రాయిల్ భద్రతా బలగాలు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యూదుల పండుగ, క్రైస్తవుల ఈస్టర్, రంజాన్ పవిత్రదినాలు అన్నీ కలిసి వచ్చిన సమయంలో గత మూడు వారాలుగా ఇజ్రాయిల్, వెస్ట్ బ్యాంక్‌ల్లో హింస చోటు చేసుకుంది. ఆ నేపథ్యంలో తాజాగా జరిగిన ఘర్షణలు ఇవి. ఇస్లామ్‌కి చెందిన మూడో పవిత్ర స్థలం అల్ అక్సా మసీదు. యూదులు దీన్ని టెంపుల్ మౌంట్‌గా పిలుస్తారు. ఈ రెండు ఆలయాలు చాలా ప్రాచీనమైనవని చెబుతారు.