Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్ మెయిల్‌ను సహించబోమని స్పష్టం చేసిన ఇటలీ
రోమ్ : రష్యా గ్యాస్ కోసం ఇకపై రూబుల్స్‌లో చెల్లింపులు జరపాలన్న డిమాండ్ నెరవేరదని ఇటలీ విదేశాంగ మంత్రి లుయిగి డి మయో స్పష్టం చేశారు. ఇది ఇయు ఆంక్షలను ఉల్లంఘించడమే కాగలదని అన్నారు. ''మేం రూబుల్స్‌లో చెల్లించలేం. యూరో నుండి రూబుల్స్కు రెండు రకాల బిల్లింగ్ పథకాలను రష్యా ప్రవేశపెట్టింది. కానీ ఇది అసాధ్యం, ఇది, రష్యా సెంట్రల్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించడమే కాగలదు.'' అని డి మయో ఇటలీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాంకేతిక కోణంలో రష్యా తనపై తానే ఆంక్షలు విధించుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఖనిజ వాయువు సరఫరాల కోసం కొత్త మార్గాలను ఇటలీ ప్రభుత్వం అన్వేషిస్తోందని మయో చెప్పారు. ఇప్పటికే అల్జీరియాలో ప్రధాని మారియో డ్రాగి పర్యటించారని, సమీప భవిష్యత్తులో అంగోలా, కాంగోలతో అదనపు సరఫరాలపై చర్చలు జరపాలని భావిస్తున్నారని చెప్పారు. ఏ రూపంలోనైనా బ్లాక్‌మెయిల్‌ను ఇటలీ సహించబోదని స్పష్టం చేశారు. సరఫరాల కోసం పలు మార్గాలకు మళ్ళాల్సిన అవసరం వుంది, అయితే ఆ దిశగా ఇంకా చర్యలు చేపట్టాల్సి వుందని అన్నారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలు ఇకపై రష్యా గ్యాస్ కోసం రూబుల్స్‌లోనే చెల్లింపులు జరపాల్సి వుంటుందని మార్చిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దానిపై ఇయుకి చెందిన పలు దేశాల నుండి తీవ్ర ప్రతికూల స్పందన ఎదురైంది. అయితే, హంగరీ, స్లొవేకియా వంటి కొన్ని దేశాలు మాత్రం రూబుల్స్‌లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేశాయి. సమీప భవిష్యత్తులో అన్ని రష్యా ఉత్పత్తులకు రూబుల్స్‌లోనే చెల్లింపులు జరపాల్సి వుంటుందని రష్యా సూచనప్రాయంగా తెలిపింది.