Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతరిక్ష యాత్రలో రికార్డు
- ఆరు మాసాలు అంతరిక్ష కేంద్రంలో గడిపి భువికి చేరుకున్న వ్యోమగాములు
బీజింగ్ : అంతరిక్ష యానంలో చైనా లాంగ్ మార్చ్ నిర్వహించింది. ఆరు మాసాల పాటు అంతరిక్ష కేంద్రంలో పనులు విజయవంతంగా ముగించుకుని షెంఝ్షూ13 రోదసీ నౌకలో ముగ్గురు వ్యోమగాములు శనివారం సురక్షితంగా భువికి తిరిగి చేరుకున్నారు. రోదసీలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములుగా వీరు రికార్డు సష్టించారు. అంతరిక్ష కేంద్రంలో సాంకేతికపరిజ్ఞానం పని తీరును ఈ బృందం పూర్తిగా పరిశీలించినట్టు చైనా రోదసీ సంస్థ (సీఎంఎస్ఏ) తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి చైనా తన అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన కీలకమైన నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. ఝాయి జిగాంగ్, వాంగ్ యాపింగ్, యె గయాంగుఫూ అనే ముగ్గురు వ్యోమగాములను తీసుకుని చైనా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.56గంటలకు మంగోలియా స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని డాంగ్‌ఫెంగ్ వద్ద షెంఝ్షూ13 రిటర్న్ క్యాప్సుల్ సురక్షితంగా దిగింది. దీంతో షెంఝ్షూ13 మానవ సహిత మిషన్ పూర్తిగా విజయవంతమైనట్టు సీఎంఎస్ఏ ప్రకటించింది.క్యాప్సుల్ భువిపై ల్యాండింగ్ అవగానే హెలికాప్టర్లలో అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది వారిని వీల్ చైర్లో ఉంచి బీజింగ్‌కు విమానంలో తరలించారు. క్యాప్సుల్ నుంచి బయటకు రాగానే సొంత ఇంటికి చేరుకున్నామన్న ఆనందం వారి కళ్లల్లో కనిపించింది. ముగ్గురు వ్యోమగాములు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్య పరీక్షల అనంతరం అధికారులు వెల్లడించారు. అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి చైనా మహిళగా రికార్డుకెక్కిన వాంగ్ మాట్లాడుతూ, మాతృ భూమికి తాను తిరిగి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నక్షత్రాలను ఏరుకొచ్చిన అమ్మ తిరిగొచ్చేసిందని తన అయిదేళ్ల కూతురికి చెప్పాలన్న ఉబలాటంతో ఆమె ఉన్నారు. అంతరిక్ష యానం చేయాలన్న నా కల నెరవేరింది అని మొదటిసారి రోదసీలోకి వెళ్లిన యే గయాంగుఫూ అన్నారు. రిటర్న్ క్యాప్సుల్ ల్యాండింగ్‌కు సంబంధించిన దశలన్నీ అనుకున్న సమయానికి కచ్చితంగా పనిచేయడంతో ఈ ప్రక్రియ సాఫీగా సాగిపోయిందని బీజింగ్ ఎయిరో స్పేస్ సెంటర్ తెలిపింది. గతేడాది అక్టోబరు 16న వాయవ్య చైనాలోని జిక్వానా ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంఝూ-13 రోదసీ నౌకను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన కోర్ మాడ్యూల్ తియాన్హెతో అనుసంధానమయ్యాక ముగ్గురు వ్యోమగాములు ఆరు మాసాల పాటు అక్కడ ఉన్నారు. ఈ సమయంలో రెండుసార్లు వీరు షెంఝూ-13 క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చి పలు శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేపట్టారు. వ్యోమగాములు సుదీర్ఘకాలం వుండేందుకు అనువుగా, అంతరిక్ష కేంద్రం నిర్మాణం, నిర్వహణకు అవసరమైన, కీలకమైన సాంకేతిక సదుపాయాలను అమర్చారు.