Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా ఘర్షణ నేపథ్యంలో ఆగేయాసియా దేశాల కూటమి(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశాన్ని వచ్చే నెల 12,13 తేదీల్లో వాషింగ్టన్లో అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించనున్నారు. రష్యాపై అమెరికా ఆంక్షలు పెద్దగా ఫలితం ఇవ్వకపోవడం, చాలా దేశాలు అమెరికా వైఖరిని సమర్ధించేందుకు నిరాకరిస్తుండడంతో బైడెన్ ప్రాంతీయ కూటములను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు. ఈ సమావేశం మార్చి 28,29 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, ఉక్రెయిన్పై ఈ కూటమిలో సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో వాయిదా వేశారు. 2021 అక్టోబరులో జరిగిన సమావేశానికి బైడెన్ హాజరై కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆసియాన్ దేశాలకు సహకరిస్తానని ఇచ్చిన హామీ నీటిమూటగానే మగిలిపోయింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ, ఇండో- పసిఫిక్ దేశాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఆసియాన్లో పది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అవి బ్రూనై, కంబోడియా, ఇందొనేషియా, లావోస్, మలేసియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. గత నెలలో సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్తో బైడెన్ చర్చలు జరిపారు. ఉక్రెయిన్-రష్యా ఘర్షణలో రష్యాకు వ్యతిరేకంగా ఐరోపా, ఇతర మిత్రపక్షాలతో కలసి పనిచేసేలా సింగపూర్ ప్రధాని నుంచి హామీ తీసుకున్నారు.