Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర నగరాలపైనా దాడులు
- ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాల తరలింపునకు అమెరికా యత్నాలు
- 8 అతిపెద్ద ఆయుధ కంపెనీలను చర్చలకు పిలిచిన పెంటగాన్
కీవ్/మాస్కో: అజోవ్ సముద్ర తీర ప్రాంత పట్టణమైన మారియపోల్పై రష్యన్ సేనలు పట్టు బిగించాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఈ పట్టణంలో చివరి ప్రతిఘటనా ప్రాంతాన్ని వశపరచుకునేందుకు రష్యా దాడులను ముమ్మరం చేసింది.అలాగే ఉక్రెయిన్‌లోని ఇతర పట్టణ ప్రాంతాలపై దాడులు చేపట్టింది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ విషయమై చర్చించేందుకు ఎనిమిది అతి పెద్ద ఆయుధ కంపెనీల అధిపతులను పెంటగాన్ (అమెరికా మిలిటరీ ప్రధాన కేంద్రం) రప్పించింది. మరో వైపు మారియపోల్లోని హల్కింగ్ స్టీల్ ప్లాంట్‌లో దాగుకుని దాడులు చేస్తున్న వందలాది మంది ఉక్రెయిన్, విదేశీ సైనికులను లొంగిపోవాలని రష్యా ఆదేశించింది. ఆయుధాలు అప్పగించి లొంగిపోతే సురక్షితంగా బయటకు పోయేందుకు అనుమతిస్తామని రష్యా సైన్యం తెలిపింది. ఈ ఆఫర్‌ను ఉక్రెయిన్ సేనలు తిరస్కరించినట్లు జెలెన్స్కీ చెప్పారు. ఆరువారాలుగా సాగుతున్న మారియపోల్ ముట్టడి ఆదివారం క్లైమాక్స్‌కు చేరుకుంది. రష్యన్ సైన్యం మారియపోల్ పట్టణంలో కీలక ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకుంది. చివరి ప్రతిఘటనా ప్రాంతం కూడా స్వాధీనమైతే మారియపోల్ రష్యా వశమైనట్టే. రష్యన్ సేనలు మారియపోల్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఆయుధ కర్మాగారాన్ని తమ దళాలు శనివారం పూర్తిగా ధ్వంసం చేశాయని రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ దళాలను పట్టణం నుంచి చాలా వరకు తరిమేశామని, అజోవ్‌స్టాల్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న సొరంగాల్లో కొందరు దాగుకున్నారని, వారి వద్ద మందుగుండు సామగ్రి అయిపోవాల్సి వస్తోంది. కాబట్టి లొంగిపోతే ప్రాణాలతో బయటపడొచ్చని తాము వారికి ఆఫర్ ఇచ్చామని రష్యన్ రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై దాడులకు రష్యా సన్నాహాలు చేస్తోంది. క్రిమియా ద్వీపకల్పం ఇప్పటికే రష్యాలో విలీనమైనందున మారియపోల్, తూర్పు ప్రాంతంలోని ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన డాన్‌బాస్‌లను కలుపుకుని రష్యా పటిష్టమైన స్థితికి చేరుకుంటుంది. ఉక్రెయిన్ దళాలు ఎంతగా ప్రతిఘటించినా రష్యన్ దళాలు ముందుకెళ్లకుండా ఆపలేకపోయాయి.
ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కింద మరో 75 కోట్ల డాలర్లు ఇవ్వనున్నట్లు అమెరికన్ మిలిటరీ తెలిపింది. ఇంతకుముందు 57.5 కోట్లు ఒకసారి, 1700 కోట్ల డాలర్లు ఒకసారి అందజేసింది. రష్యా దాడులతో బెంబేలెత్తిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎప్పుడు చూసినా ' ఆయుధాలు...ఆయుధాలు...ఆయుధాలు' అంటూ నాటో దేశాల వెంటబడుతున్నారు. రష్యా దాడులను ఎదుర్కోవాలంటే తమకు తక్షణమే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు పంపాలని పశ్చిమ దేశాలను జెలెన్స్కీ తాజాగా కోరారు. రష్యన్ దళాలు ఉక్రేనియన్లను ఊచకోత కోస్తున్నాయని జెలెన్స్కీ, ఆయనకు వత్తాసు పలుకుతున్న అమెరికా, దాని మిత్ర పక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. . ఈ ఆరోపణలను రష్యా నిర్ద్వంద్వంగా ఖండించింది. రష్యాను క్రూరమైన దేశంగా ముద్ర వేసే ఇటువంటి యత్నాలను మానుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను పుతిన్ హెచ్చరించారు. సరిహద్దుల్లోని రష్యన్ గ్రామాలపై ఉక్రెయిన్ ఇటీవల రాకెట్ దాడులకు దిగడంతో కీవ్‌పై రష్యా తన దాడులను ఉధృతం చేసింది. మస్కోవా యుద్ధ నౌక ఇటీవల నల్ల సముద్రంలో మునిగిపోవడానికి మందుగుండు పేలుడే కారణమని రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ మాత్రం తాము జరిపిన క్షిపణి దాడుల వల్లే ఆ నౌక మునిగిపోయిందని ప్రచారం చేస్తోంది.