Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : దేశంలో సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా సోమవారం కొత్త క్యాబినెట్‌ను నియమించారు. ఇందులో తన కుటుంబ సభ్యులెవరూ లేకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తంగా 17మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో చాలామంది మాజీ క్యాబినెట్ మంత్రులేనని అధికారులు తెలిపారు. మరోవైపు గత పది రోజుల నుంచి అధ్యక్షుడు రాజీనామా చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. మంగళ వారం పార్లమెంట్ సమావేశమవనుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. రాజపక్సా సోదరులైన చమల్, బసిల్ రాజపక్సా, మేనల్లుడు నమల్ రాజపక్సా ఈ కొత్త కేబినెట్లో లేరు. వీరందరూ గతంలో కీలక పదవులు నిర్వహించిన వారే.ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండడంతో ఏప్రిల్ 3న వీరందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సా,ప్రధాని మహిందా రాజపక్సా అధికారాన్ని అంటిపెట్టుకునే వున్నారు. వారు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు.