Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ ఎంపీల ఆమోదం
లండన్ : బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై పార్లమెంటరీ దర్యాప్తు జరిపేందుకు ప్రతినిధుల సభ ఎంపీలు ఆమోద ముద్ర వేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశంలో విధించిన లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన విషయంలో ప్రధాని చెబుతున్నది వాస్తవమా కాదా అనే విషయం తేల్చేందుకు పార్లమెంటరీ దర్యాప్తు జరపాలని బ్రిటీష్ ఎంపీలు గురువారం నిర్ణయించారు. ప్రతినిధుల సభలో లాంఛనంగా జరగాల్సిన ఓటింగ్ కూడా లేకుండానే సభ్యులు ఆమోదం తెలిపారు. పార్లమెంట్ సభా హక్కుల కమిటీ దీనిపై దర్యాప్తు చేపడుతుందని భావిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే బోరిస్ జాన్సన్ పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారని రుజువైతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ తొలుత ఈ దర్యాప్తుకు పట్టుబట్టింది. దాన్ని నిరోధించడానికి కన్జర్వేటివ్ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
పార్లమెంట్లో కన్జర్వేటివ్‌లకు గణనీయంగానే మెజారిటీ వుంది కానీ, ప్రధాని వ్యవహార శైలి పట్ల చాలామంది ఎంపీలు సంతృప్తిగా లేరు, స్వంత పార్టీ సభ్యులే ఆయన తీరుపై మండిపడుతున్నారు. దేశ ప్రజలపై విధించిన ఆంక్షలనే స్వయంగా ప్రధానే ఉల్లంఘించిన తీరు పట్ల మెజారిటీ కన్జర్వేటివ్‌లు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజాయితీ, సమగ్రత, వాస్తవాలు వెల్లడించడం వంటి సూత్రాలను పరిరక్షించేందుకే ఈ చర్య అని లేబర్ నేత కెయిర్ స్టెయినర్ వ్యాఖ్యానించారు. ఈ సభలోని ప్రతి రాజకీయ పార్టీ సభ్యులకు ఇదొక మార్గదర్శక సూత్రమని అన్నారు. కానీ ఈనాడు ఈ సూత్రంపైనే దాడి జరిగిందని అన్నారు. ప్రతినిధుల సభ ఈ నిర్ణయం తీసుకున్నపుడు జాన్సన్ సభలో లేరు, భారత్ పర్యటనలో వున్నారు. కరోనా ఆంక్షల ఉల్లంఘన కేసులో గత వారంలో జాన్సన్‌కు పోలీసులు 50పౌండ్లు జరిమానా కూడా విధించారు.
అధికారంలో వుంటూ చట్టాన్ని ఉల్లంఘించిన మొదటి బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సనే. అయితే పార్టీ గేట్ కుంభకోణంపై పోలీసులు, సివిల్ సర్వీస్ దర్యాప్తులు పూర్తయ్యేవరకు సభా హక్కుల కమిటీ దర్యాప్తు ప్రారంభం కాకపోవచ్చుని భావిస్తున్నారు.