Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ బ్యాంక్ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
కీవ్ : ఒకసారి యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌కు వందల కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అవసరమవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 60వేల కోట్ల డాలర్ల మేరకు సాయం కావాల్సివస్తుందని ప్రధాని డెనిస్ షామైగల్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్ గురువారం నిర్వహించిన వీడియో సమావేశంలో వీరు ఈ మేరకు ప్రకటనలు చేశారు. ''ప్రస్తుతం మాకు జరిగిన ఆర్థిక నష్టాలకు ప్రతి నెలా 700కోట్ల డాలర్ల వరకు అవసరమవుతాయి. ఈ యుద్ధం తర్వాత పునర్మిర్మాణం కోసం మరిన్ని వందల కోట్ల డాలర్లు అవసరమవుతాయి.'' అని జెలెన్స్కీ చెప్పారు. మీకు కూడా ఇటువంటి లెక్కలు వుండి వుంటాయని భావిస్తున్నానని అన్నారు. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడమే కాదు, ఇయుతో పూర్తిగా సమ్మిళితమవగల కొత్త ఆర్థిక వ్యవస్థను రూపొందించడం లక్ష్యమని, దానిపై కసరత్తు ప్రారంభమైందని ప్రధాని డెనిస్ చెప్పారు. ఇటువంటి పునరుద్ధరణ, పునర్మిర్మాణం, పరివర్తనా కార్యక్రమాలకు దాదాపు 60వేల కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుందన్నారు. రష్యాతో అన్ని సంబంధాలు తెంచుకోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా వుండాలని జెలెన్స్కీ అన్నారు. రష్యా ఎగుమతి కార్యక్రమాలపై పన్ను విధించాలని ప్రతిపాదించారు. అలా వసూలైన మొత్తాన్ని ఉక్రెయిన్‌కు, రష్యా చర్యల వల్ల నష్టపోయిన ఇతర దేశాలకు అందచేయాలన్నారు.
రష్యా అదుపులో అజవోస్తల్ ప్లాంట్ భవనం
కీలక నగరమైన మరియుపోల్‌ను రష్యా బలగాలు పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకున్నాయని గురువారం ప్రకటించినప్పటికీ ఇంకా దాదాపు 2వేల మంది సైనికులు అజవోస్తల్ స్టీల్ ప్లాంట్ ఏరియాలో వుండి ప్రతిఘటిస్తున్నారు. ఇదిలావుండగా, అజవోస్తల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉన్నతాధికారులు, వాణిజ్యవేత్తలు, నిపుణులు, జర్నలిస్టులతో సహా మొత్తంగా 29మంది అమెరికన్ పౌరులను రష్యా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అమెరికా ఉన్నతాధికారుల భార్యలు కూడా ఈ జాబితాలో వున్నారు. అమెరికా తన ఆంక్షలను విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో తామీ చర్య తీసుకున్నట్టు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.