Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయుధ స్థావరం నాశనం
- మారియపోల్ ఖాళీ చేస్తున్న ఉక్రెయిన్
- పుతిన్, జెలెన్స్కీలతో వచ్చేవారం ఐరాస చీఫ్ భేటీ
కీవ్/ మాస్కో: మరియాపోల్‌ను వశపరచుకున్న రష్యా సైన్యం తాజాగా నల్ల సముద్రాన్ని ఆనుకుని వున్న మరో పట్టణం ఒడెస్సాపై దాడులకు దిగింది. ఈ దాడిలో పసిపిల్లతో సహా అయిదుగురు మరణించారని, మరో 18 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. మారియపోల్ పట్టణాన్ని రష్యా సైన్యం వశపరచుకోవడంతో అక్కడి నుంచి పౌరులను ఖాళీ చేయించేందుకు ఉక్రెయిన్ చర్యలు చేపట్టింది. మరోవైపు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ నేత జెలెన్స్కీతో వచ్చేవారం విడివిడిగా సమావేశం కానున్నారు.మంగళవారం నాడు గుటెరస్ మాస్కోకు వెళ్లి రష్యా అధ్యక్షుడితో సమావేశమవుతారు. ఆ తరువాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో లంచ్ చేస్తారు. గురువారం నాడు ఉక్రెయిన్ నేత జెలెన్స్కీతోను, విదేశాంగ మంత్రి డిమిట్రి కులెబాతోను ఐరాస చీఫ్ సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఘర్షణకు స్వస్తి చెప్పి, శాంతి పునరుద్ధరణకు సహకరించాలని గుటెరస్ ఈ ఇరువురు నేతలను కోరనున్నారు. రష్యా , ఉక్రెయిన్ ఘర్షణ ఈ నెల 24తో మూడు మాసాలు పూర్తి చేసుకుంది. యుద్ధం ఇప్పుడు రెండవ దశకు చేరిందని, ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశాలను తమ అదుపులోకి తెచ్చుకోవడమే రెండో దశ సైనిక చర్య ప్రధాన లక్ష్యంగా ఉంటుందని రష్యన్ మిలిటరీ అధికారి తెలిపారు. ఇదిలా వుండగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో గల అతి పెద్ద ఆయుధ స్థావరాన్ని నాశనం చేశాయి. పశ్చిమ దేశాల ఆయుధాలు నిండుగా ఉన్న మూడు గిడ్డంగులపై వైమానిక దళం క్షిపణులతో దాడి చేసినట్లు రష్యన్ రక్షణ శాఖ ప్రతినిధి కొనషెంకోవ్ తెలిపారు. ధ్వంసమైన ఆయుధాల్లో చాలావరకు అమెరికా పంపినవే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయిల్‌ను రష్యా హెచ్చరించింది.రష్యన్ దళాలు 22 ఉక్రెయిన్ మిలిటరీ సదుపాయాలపై దాడులు చేసినట్లు కొనషెంకొవ్ తెలిపారు.