Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్
- ఆయుధాలు పంపడం మానితేనే ఫలితం వుంటుందన్న లావ్రోవ్
- తూర్పు, దక్షిణ ప్రాంతాలపై రష్యా బలగాల దృష్టి
కీవ్, మాస్కో : యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరుగుతున్న శాంతి చర్చల్లో ఎదుటిపక్షం సరిగా వ్యవహరించడం లేదంటూ ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ ప్రాంతాలపై దృష్టి పెట్టిన రష్యా పలు ప్రాంతాల్లో బాంబు దాడులు జరుపుతోంది. తాజాగా కీవ్‌కు మరిన్ని ఆయుధాలు అందజేస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ఎత్తివేయడం శాంతి చర్చల్లో భాగమని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ అన్నారు. ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందడం, పైగా రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో శాంతి చర్చలకు అవరోధం కలుగుతోందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారమవాలని అమెరికా, నాటో దేశాలు నిజంగా కోరుకుంటున్నట్లైతే కీవ్‌కు ఆయుధాలు పంపడాన్ని మానివేయాలని లావ్రోవ్ సూచించారు. ప్రస్తుతం ఈ చర్చల క్రమం సంక్లిష్టంగా సాగుతోందని అన్నారు. గత నెల రోజుల నుండి రోజూ వీడియో సమావేశాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలను హత్య చేయడంపైనే రష్యా ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నందున చర్చలు ఫలప్రదమవడానికి గల అవకాశాలు చాలా తక్కువగా వున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పోలిష్ జర్నలిస్టులతో వ్యాఖ్యానించారు. తూర్పు డాన్బాస్ ప్రాంతంలో రష్యా బలగాలు శనివారం దాడులు జరిపాయని, కానీ మూడు లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాయని ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది.
రాజధానికి చుట్టుపక్కల తమ ఆధీనంలో వున్న ప్రాంతాల్లో రష్యా దళాలు అత్యాచారాలకు దిగుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మాస్కో వీటిని తిరస్కరిస్తోంది. ఇప్పుడు తూర్పు, దక్షిణ ప్రాంతాలపైనే రష్యా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటివరకు 10లక్షల మందికి పైగా ప్రజలను ఉక్రెయిన్ నుంచి రష్యాకు తరలించినట్లు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ జిన్హువాతో మాట్లాడుతూ చెప్పారు. శాంతి చర్చల్లో ఉక్రెయిన్‌కు బ్రిటన్, అమెరికా మద్దతిస్తున్నాయి. కీవ్‌కు మరిన్ని ఆయుధాలు అందజేయడం ప్రస్తుతం కీలకమని భావిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో ఉక్రెయిన్‌కు అందించే కొత్త సాయానికి ఆమోద ముద్ర లభిస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీపెలోసి చెప్పారు.
గత రెండు మాసాల నుండి రష్యా బలగాల ముట్టడిలో వున్న మరియుపోల్ నగరం శవాల గుట్టగా మారింది. ఎమర్జన్సీ వర్కర్లు వీధుల్లో నుండి శవాలను తరలిస్తున్నారు. ఇంకా లక్ష మంది ప్రజల వరకు ఆ నగరంలో వున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. వారిని కాపాడాల్సిన అవసరం వుందని కెప్టెన్ పాలమార్ వ్యాఖ్యానించారు.