Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్ : స్పెయిన్ ప్రధాని, రక్షణ మంత్రుల సెల్ఫోన్లు గతేడాది పెగాసస్ స్పైవేర్‌కు లక్ష్యంగా మారాయని స్పానిష్ అధికారులు తెలిపారు. గతేడాది మేలో ప్రధాని పెడ్రో సాంచెజ్ మొబైల్ ఫోన్ రెండుసార్లు దాడికి గురైందనీ, ఆ తర్వాత నెలలోనే రక్షణ మంత్రి మార్గరిటా రాబెల్స్ ఫోన్‌ను కూడా అదే తరహాలో లక్ష్యంగా చేసుకున్నారని ప్రెసిడెన్సీ మినిస్టర్ ఫెలిక్స్ బోలనాస్ సోమవారం హడావిడిగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ దాడుల వల్ల గణనీయమైన డేటా లభించిందని ఆయన చెప్పారు. హ్యాకింగ్ తీరును వివరిస్తూ నివేదికలను స్పెయిన్ నేషనల్ కోర్టుకు పంపించామనీ, వాటిపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఇది అక్రమంగా, అనధికారికంగా జోక్యం చేసుకోవడమేననటంలో ఎలాంటి సందేహంలేదని బోలనాస్ వ్యాఖ్యానించారు. 'బయటి నుంచి ఇది వచ్చింది, దీనికి జ్యుడీషియల్ ఆమోదముద్ర లేదు'' అని అన్నారు. 2017- 2020 మధ్యలో ఈశాన్య కెటలోనియా ప్రాంతంలోని వేర్పాటువాద ఉద్యమంతో సంబంధమున్న డజన్ల సంఖ్యలోని వ్యక్తుల సెల్ఫోన్లు ఎందుకు పెగాసస్ లక్ష్యంగా మారాయో వివరించాలంటూ స్పెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికైన అధికారులు, లాయర్లు, మానవ హక్కుల కార్యకర్తలతో సహా మొత్తంగా 65 మంది ఫోన్లను పెగాసస్ స్పైవేర్‌తో దాడి చేశారని సైబర్ సెక్యూరిటీ గ్రూపు సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. వేర్పాటువాదులపై నిఘా పెట్టేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ప్రాంతీయ కెటలాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై పూర్తి వివరణలు వెల్లడై, బాధ్యులైన వారిని శిక్షించేవరకు స్పెయిన్ ప్రభుత్వంతో సంబంధాలు సస్పెన్షన్‌లో పెడతామని ప్రకటించింది.