Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : ప్రముఖ రాజకీయవేత్త, క్యూబా దౌత్యవేత్త రికార్డో అలర్కాన్ (84) ఆదివారం హవానాలో కన్నుమూశారు. ఐక్యరాజ్య సమితిలో క్యూబా రాయబారిగా చేసిన ఆయన 20ఏళ్ల పాటు క్యూబా పార్లమెంట్ స్పీకర్‌గా సేవలందించారు. అలర్కాన్ పేరును ప్రస్తావించకుండా క్యూబా దౌత్య చరిత్రను లిఖించలేమని రుమేనియాలోని హవానా ఎంబసీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. 1991 నుండి 93 వరకు అలర్కాన్ క్యూబా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. గొప్ప దేశభక్తుడు, క్యూబా విప్లవంలో అద్భుతమైన దౌత్యవేత్త అయిన రికార్డో మృతితో దేశ ప్రజలందరూ విచారంలో వున్నారని డిప్యూటీ విదేశాంగ మంత్రి జోసెఫినా వైడల్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మన తరం దౌత్యవేత్తలందరికీ మాస్టర్ అయిన రికార్డో పట్ల గౌరవం, అభిమానం పుష్కలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన శిష్యులుగా వుండడం కూడా మనకు గౌరవమేననని అన్నారు. ఆయన అందించిన సేవలు, చేసిన కృషి ప్రస్తుత, భవిష్యత్ తరాలకు వారసత్వంగా నిలిచిపోతాయన్నారు. ''మన జీవిత కర్తవ్యం సంపూర్ణంగా నెరవేరినపుడు మృత్యువు అనేది సత్యం కాదు : జోస్ మార్టి'' అన్న వ్యాఖ్యలను ప్రముఖ జర్నలిస్టు హంబర్టో లోపెజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిజమైన విప్లవవాది, సామ్రాజ్యవాద వ్యతిరేకి, ఫైడల్, రావుల్ కాస్ట్రోలకు, ప్రజలకు, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడైన అలర్కాన్ ఎప్పటికీ మనకి గుర్తుండిపోతారని పేర్కొన్నారు.