Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాసియా దేశాలను కోరిన యునెస్కో
- కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్టులకు నివాళులు
పారిస్ : జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని దక్షిణాసియా ప్రభుత్వాలను ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కోరింది. మంగళవారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా యునెస్కో ఈ విజ్ఞప్తి చేసింది. కోవిడ్ సమయంలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన జర్నలిస్టులకు యునెస్కో నివాళులర్పించింది. మహమ్మారి కారణంగా దక్షిణాసియా దేశాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లను యునెస్కో పరిశీలించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అండ్ ప్రెస్ ఎంబ్లమ్ కాంపెయిన్ ఉటంకిస్తూ.. దక్షిణాసియాలో కోవిడ్‌తో 300 మంది జర్నలిస్టులు మరణించారనీ, ఒక్క భారత్‌లోనే 284 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. పలు లాక్డౌన్లు వచ్చినా.. సమాచారాన్ని చేరవేసేందుకు దక్షిణాసియాలోని జర్నలిస్టులు తమ ప్రాణాలు పణంగా పెట్టారనీ, విధి నిర్వహణలో ఉండగానే కరోనా బారినపడి వారు మృతిచెందారని యునెస్కో తన ప్రకటనలో పేర్కొంది.
భూటాన్, భారత్, మాల్దీవులు, శ్రీలంకకు యునెస్కో ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఫాల్ట్ మాట్లాడుతూ.. సంక్షోభ సమయాల్లో సరైన సమాచారంతో జర్నలిస్టులు ముందంజలో ఉన్నారనీ, వారే తొలి ప్రతి స్పందనదారులుగా ఉంటారని అన్నారు. వారి మానసిక, శారీరక భద్రత మెరుగ్గా ఉండాలని అన్నారు. కోవిడ్ సంక్షోభం తర్వాత.. ఆర్థిక సంక్షోభం కారణంగా పలు మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను మూసివేయడాన్ని కూడా యునెస్కో గుర్తించింది. ఆఫ్గాన్‌లో సుమారు 300లకు పైగా మీడియా సంస్థలు మూతబడ్డాయని, భారత్, పాక్, నేపాల్‌లో అనేక మంది ఉద్యోగాలు పోయాయనీ, అనేక మీడియా సంస్థలు పబ్లికేషన్స్‌ను నిలిపివేశాయని తెలిపింది.