Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలకం వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె
- పాల్గొన్న 2వేలకు పైగా కార్మికసంఘాలు
- దేశవ్యాప్తంగా స్తంభించిన జన జీవనం
కొలంబో : అధ్యక్షుడు గొటబయా రాజపక్సా, ఆయన ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం శ్రీలంక వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు సమ్మె నిర్వహించాయి. దీంతో దేశవ్యాప్తంగా జన జీవనం స్తంభించింది. వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా రద్దీగా వుండే ప్రాంతాల్లో కూడా రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఈ సమ్మెలో ఆరోగ్యం, పోస్టల్, పోర్ట్, ఇతర ప్రభుత్వ సర్వీసులకు చెందిన పలు రంగాల కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. మొత్తంగా 2వేలకు పైగా కార్మిక సంఘాలు ఈ సమ్మె పిలుపుతో చేతులు కలిపాయని, కేవలం అత్యవసర సర్వీసలు మాత్రమే అందుబాటులో వున్నాయని సంయుక్త కార్మిక సంఘాల కార్యాచరణ గ్రూపునకు చెందిన రవి కుముదేష్ తెలిపారు. ''మొత్తంగా తాను, తన ప్రభుత్వం గద్దె దిగాలని ఈనాటి కార్యాచరణ కోరుతోంది. అయినా వారు మా విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన పక్షంలో ఈ నెల 11నుండి ప్రభుత్వం రాజీనామా చేసేవరకు దేశవ్యాప్తంగా సమెమ కొనసాగుతుంది.'' అని కుముదేష్ స్పష్టం చేశారు. టీచర్స్ ట్రేడ్ యూనియన్ నేత మహిందా జయసింఘె మాట్లాడుతూ, శుక్రవారం టీచర్లు, ప్రిన్సిపాల్స్ ఎవరూ పాఠశాలలకు హాజరు కాలేదని చెప్పారు. డీజిల్ కోసం క్యూలు బారులు తీరిన నేపథ్యంలో తాము సర్వీసులు నడపడం కష్టంగా వుందని ప్రైవేట్ బస్ ఆపరేటర్లు తెలిపారు. బస్సుల కోసం డీజిల్ లేదని ప్రైవేటు బస్సు యజమానుల సంఘం అధ్యక్షుడు గమును విజెరత్నె తెలిపారు. దీంతో రాష్ట్ర రవాణా సంస్థ అదనంగా బస్సులు నడపాలని నిర్ణయించింది.
అనూహ్యమైన రీతిలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, ఫలితంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమర్ధవంతంగా పరిష్కరించలేని ప్రభుత్వం ఇక అధికారంలో వుండరాదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. అధ్యక్షుడు, ప్రధాని సహా మొత్తంగా ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా గత నెల రోజుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు జరుగుతునే వున్నాయి. అయినా రాజపక్సా సోదరులు చలించడం లేదు. తాము రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ తోసిపుచ్చుతున్నారు.
పార్లమెంట్ వద్ద అర్ధరాత్రి విద్యార్ధుల ధర్నా
పార్లమెంట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద గల రహదారిపై గురువారం అర్ధరాత్రి విద్యార్ధులు ధర్నా చేశారు. దాంతో వారిపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. భారీగా వర్షం పడుతున్నా విద్యార్ధులు ధర్నాను కొనసాగించారు. 'క్రూక్స్ గో హోం విలేజ్' అనే పేరుతో పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద వారు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసేవరకు ఈ ఆందోళన కొనసాగుతుందని ఇంటర్ యూనివర్విఠీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యకర్తలు చెప్పారు. రాత్రంతా విద్యార్ధులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. విద్యార్ధులకు మద్దతుగా పెద్ద ఎత్తున కుటుంబాలు తరలివచ్చాయి. ప్రభుత్వ అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ, వారి వైఫల్యాలను దుయ్యబడుతూ తాత్కాలికంగా వేసిన వేదికపై ప్రసంగాలు చేశారు. విప్లవాత్మక గీతాలు ఆలపించారు.