Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారానికి శ్రీకారం
సావోపోలో : వచ్చే అక్టోబరులో జరగనున్న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలకు వర్కర్స్ పార్టీ (పిటి) వ్యవస్థాపకుడు, ఏడు పార్టీలతో కూడిన వామపక్ష ప్రగతిశీల కూటమి నేత లూలా ఇనాసియో డ సిల్వా శనివారం నాడిక్కడ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ వెంటనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పూర్తి స్థాయిలో ప్రచారం ఆగస్టులో మొదలవుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు, పచ్చి మితవాది జెయిరో బోల్సనారో దేశాన్ని అన్ని విధాలా నాశనం చేశారని లూలా విమర్శించారు. రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పెద్ద పరీక్ష అని మాజీ అధ్యక్షుడు లూలా అన్నారు. దేశ సార్వభౌమత్వం, అభివృద్ధి, న్యాయం, సామాజిక సమ్మిళితం, ప్రజాస్వామ్యం, పర్యావరణాన్ని పరిరక్షించడంతో బాటు బ్రెజిల్ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు పేర్కొన్నారు. 'ఈ ఎన్నికలు తన జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. మీరు నా పై ఉంచిన నమ్మకమే నాకు కొండంత బలం. ఆ ధైర్యంతోనే ముండుకు సాగుతాను' అని వర్కర్స్ పార్టీ నేత చెప్పారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 44 శాతం ఓట్లతో లూలా డ సిల్వా టాప్ ఫేవరేట్‌గా నిలిచారు. ఆయన ప్రత్యర్థి బోల్సనారోకు 30 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.