Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మహింద రాజపక్స రాజీనామా నిరసనకారులపై
- అధికార పార్టీ ఎంపీ కాల్పులు
- ఆ తర్వాత జరిగిన ఘర్షణలో అధికార పార్టీ ఎంపీ మృతి
- అధ్యక్షుడు గోటబయ కూడా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్
- నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య దాడులు
- 78మందికి తీవ్రగాయాలు
కొలంబో : శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య పరస్పర దాడులతో సోమవారం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా..నిరసనకారులు శాంతించాలని మహింద రాజపక్స కోరినా ఉద్రిక్త పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించిన కొద్ది గంటల్లోనే దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు గోటబయకు ప్రధాని తన రాజీనామా లేఖను సమర్పించారు. అలాగే మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు.
సోమవారం రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్‌గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈక్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు. ఈక్రమంలో అక్కడ జరిగిన ఘర్షణల్లో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడయా తెలిపింది.
ఏప్రిల్ 9 నుంచి అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతోన్న వారిపై రాజపక్స విధేయులు సోమవారం కర్రలతో దాడికి దిగినట్టు సమాచారం. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు..పోలీసులు టియర్‌గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన శ్రీలంక ప్రధాని మహీంద రాజకపక్స..ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభ నివారణకు ఆర్థిక పరిష్కారం అవసరమని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
మే 6న కేబినెట్ ప్రత్యేక సమావేశంలో అధ్యక్షుడు గోటబయ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఒకనెల వ్యవధిలో రెండుమార్లు అత్యవసర పరిస్థితి విధించటంతో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది నిరసనకారులు గోటబయ అధికార నివాసం ముందు గుమికూడి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని రాజపక్స, అధ్యక్షుడు గోట బయ తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాం డ్ చేస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే, అందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని రాజపక్స వెల్లడించారు. ఆహార, ఇంధన, ఔషధాల కొరతతోపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండటంతో శ్రీలంక అల్లాడుతోంది. ఇప్పటికే విదేశీ రుణాలను డీఫాల్ట్‌గా ప్రకటించిన శ్రీలంక, మొత్తం 51 బిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారుగా రూ.4లక్షల కోట్లు) విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. సాయం కోసం పొరుగు దేశాలవైపు చూస్తోంది. భారత్ తన ఆపన్నహస్తాన్ని అందించి, క్లిష్ట సమయంలో తనవంతు సాయం చేస్తోంది.
రంగంలోకి రాజపక్స విధేయులు
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై..ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో సోమవారం స్థానికంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దాంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. మరోవైపు దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 78మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న దేశంలో..పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. అధికార నేతల రాజీనామాకు డిమాండ్ పెరుగుతోంది.