Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు గొటబాయ
కొలంబో: తీవ్ర సంక్షోభం, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహంతో అట్టుడుకుతున్న శ్రీలంకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే (73) బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నేత రణిల్ విక్రమ సింఘే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో మరో వారంలోనే నూతన క్యాబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మాజీ ప్రధాని మహీంద రాజపక్సే పార్టీ కూడా విక్రమ సింఘేకే పూర్తి మద్దతిచ్చింది. ప్రజాందోళనలు మిన్నంటిన నేపథ్యంలో ప్రధాని పదవికి మహీంద రాజపక్సే రాజీనామా చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే విధానాలు, ఆయన కుటుంబీకులే కారణమంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం నాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన గొటబాయ.. పార్లమెంట్లో మెజార్టీ, ప్రజల విశ్వాసం పొందిన కొత్త ప్రధాని పేరును ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని విక్రమ సింఘేతో చర్చలు జరిపిన అనంతరం దేశ ప్రధానిగా ఆయనకు పగ్గాలు అప్పజెప్పారు. మరోవైపు అధ్యక్ష అధికారాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నానన్న గొటబాయ రాజపక్స.. కొత్త మంత్రివర్గంలో తమ కుటుంబీకులెవరూ ఉండబోరని హామీ ఇచ్చారు. ఇక మాజీ ప్రధాని మహీంద రాజపక్సేకు శ్రీలంక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయన విదేశాలకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. మహీందతో పాటు ఆయన కుమారుడు, ఎంపీ నమల్ రాజపక్సతో పాటు మరో 15 మంది కూడా విదేశాలకు వెళ్లొద్దని కోర్టు ఆంక్షలు విధించింది.