Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సూపర్ మార్కెట్లో కాల్పులు
- 10 మంది మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- చనిపోయినవారంతా నల్లజాతీయులే!
- అధ్యక్షుడు బైడెన్ ఖండన
న్యూయార్క్: అమెరికాలో జాతి విద్వేషం మళ్లీ బుసలు కొట్టింది. రెండేండ్ల క్రితం నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను ఊపిరాడకుండా మోకాలితో మెడపై అదిమి చంపేసిన శ్వేతజాతి దురహంకార పోలీస్ అధికారి నికృష్ట చర్యను మరవక ముందే న్యూయార్క్‌లోని బఫెలో సూపర్ మార్కెట్లో మరో దారుణం చోటుచేసుకుంది. పద్దెనిమిదేళ్ల ఓ శ్వేత జాతి ప్రేరేపిత ఉన్మాది విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 10 మంది అమాయకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తుపాకీ కాల్పుల్లో మొత్తం 13 మంది బాధితుల్లో 11 మంది ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్నట్లు బఫెలో పోలీస్ కమిషనర్ జోసెఫ్ గ్రామగ్లియా తెలిపారు. మిలిటరీ తరహా దుస్తులు, రక్షణ కవచం, హెల్మెట్ ధరించిన శ్వేతజాతి దురహంకారి సూపర్మార్కెట్లో గేమింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.. రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అమాయకులను కాల్చి చంపిన తరువాత ఉన్మాది తుపాకీని మెడలో వేసుకున్నాడు. అతి కష్టం మీద అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బఫెలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలిరచినట్టు పోలీస్ కమిషనర్ గ్రామగ్లియా తెలిపారు. సాయుధ దుండగుడ్ని పేటన్ జెండ్రాన్‌గా గుర్తించామని, అతనిపై ఫస్ట్ డిగ్రీ హత్యా నేరాభియోగాన్ని మోపామని పోలీసు కమిషనర్ తెలిపారు. టాప్స్ ఫ్రెండ్లీ మార్కెట్ అన్న పేరుతో ఉన్న ఆ సూపర్ మార్కెట్ నల్లజాతీయులు అధికంగా ఉన్న ఏరియాలో ఉంది. దాడికి ముందు నిందితుడు ఆ ప్రాంతంలో గంటల తరబడి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా న్యాయ శాఖ ఈ మారణకాండను 'ద్వేషపూరిత, జాతి ఉన్మాదంతో కూడిన దేశీయ తీవ్రవాద చర్యగా పేర్కొంది.
బఫెలోలో జరిగిన నరమేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. బాధితుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. 'అమెరికా ప్రథమ మహిళ, నేను మృతులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము.' అని బైడెన్ పేర్కొన్నారు. జాతి విద్వేషంతో కూడిన ఈ ఉన్మాద చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు.
అమెరికాలో ఇటువంటి హింసాత్మక ఘటనలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి జాతివిద్వేషం, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి ముఖ్య కారణాలని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల నిర్వహించిన ఒ సర్వేలో గత ఒక్క ఏడాదిలోనే 1.9 కోట్ల ఆయుధాలు అమెరికాలో అమ్ముడయ్యాయి. పెరిగిన తుపాకీ అమ్మకాలకు తగినట్లుగానే తుపాకీ సంబంధిత హింసాత్మక ఘటనలు కూడా పెరిగిపోయాయని ఆ సర్వే తెలిపింది. 2020లో 45,222 మంది తుపాకీ సంబంధిత హింసాత్మక ఘటనల్లో చనిపోయినట్టు ఆ పత్రిక వెల్లడించింది.