Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లుంబిని (నేపాల్) : అంతర్జాతీయ బౌద్ధ సాంస్కృతిక, వారసత్వ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు. లుంబిని మోనాస్టిక్ జోన్లో నిర్మిస్తున్న ఈ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేబా కూడా పాల్గొన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే, ప్రపంచ స్థాయి సదుపాయాలు కలిగిన కేంద్రంగా మారనుంది. బౌద్ధమతంలోని ఆథ్యాత్మిక అంశాల సారాన్ని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ''మన సాంస్కృతిక సంబంధాలను ముందుకు తీసుకెళదాం.'' అని వ్యాఖ్యానిస్తూ, భారత బౌద్ధ కేంద్ర శిలాన్యాస్ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రధానులు పాల్గొన్నారంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి ట్విట్టర్లో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబిసి) చొరవతో ఈ కేంద్రం నిర్మితమవుతోందని అన్నారు. ఆధునిక వసతులతో రూపొందే ఈ భవనంలో ఇంధనం, నీరు, వృధా వస్తువుల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వుండబోవని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రార్ధనా హాల్స్, ధాన్య కేంద్రాలు, లైబ్రరీ, ఎగ్జిబిషన్ హాల్, కెఫెటేరియా, కార్యాలయాలు ఇతర సదుపాయాలన్నీ ఇందులో వుంటాయని తెలిపింది. లుంబిని అభివృద్ధి ట్రస్టు (ఎల్డిటి) ఐబిసికి కేటాయించిన స్థలంలో ఈ కేంద్రం నిర్మితమవుతోంది. అంతకుముందు బౌద్దపూర్ణిమ సందర్భంగా ప్రధాని మోడీ పవిత్ర మాయాదేవి ఆలయంలో ప్రార్ధనలు నిర్వహించారు. ఆయనతో పాటు నేపాల్ ప్రధాని ఇతర అధికారులు కూడా వున్నారు. ఆ ఆలయానికి సమీపంలో అశోక చక్రవర్తి స్థాపించిన అశోక స్తంభం వద్ద ఇరువురు ప్రధానులు దీపాలు వెలిగించారు.