Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : గత మూడు దశాబ్దాల్లో మొదటిసారిగా ఒక మహిళను ఫ్రాన్స్ ప్రధానిగా నియమించారు. కార్మిక శాఖ మంత్రిగా వున్న ఎలిజబెత్ బార్న్‌ను ప్రధానిగా నియమిస్తున్నట్టు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. దేశంలో పెద్ద ఎత్తున తాను అమలు చేయతలపెట్టిన సంస్కరణల ప్రణాళికకు ఆమె నేతృత్వం వహిస్తారని తెలిపారు. అంతకుముందు ప్రధాని జేన్ కాస్టెక్స్ అధ్యక్షుడికి తన రాజీనామాను అందచేశారు. ఏప్రిల్‌లో మాక్రాన్ తిరిగి అధ్యక్షుడుగా ఎన్నికైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణలు వుంటాయని అందరూ భావించారు. అందులో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. వారాల తరబడి వదంతులకు స్వస్తి పలుకుతూ ఎలిజబెత్ బార్న్ నియామకాన్ని ధృవీకరించారు. ఫ్రాన్స్ ప్రధానిగా ఎడిత్ క్రెసన్ 1991 మే నుండి 1992 ఏప్రిల్ వరకు అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ హయాంలో పనిచేశారు. జూన్‌లో కీలకమైన పార్లమెంటరీ ఎన్నికలు వున్న నేపథ్యంలో కేబినెట్‌కు కొత్త రూపం ఇవ్వడానికి మాక్రాన్ సంసిద్ధమయ్యారు. కొద్ది రోజుల్లో బార్న్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దేశీయ ఎజెండాను అమలు చేయాలంటే మాక్రాన్‌కు పార్లమెంట్లో మెజారిటీ అవసరం. వామపక్ష భావజాలం కలిగిన, పర్యావరణ ప్రమాణాలు పాటించే మహిళను ప్రధానిగా చూడాలనుకుంటున్నానని మాక్రాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆరోగ్య రంగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని మాక్రాన్ భావిస్తున్నారు. అలాగే వాతావరణ సంక్షోభ పరిష్కారం కూడా తన ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు.