Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ ఏర్పాటు దిశగా లేబర్ పార్టీ ?
సిడ్నీ : శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఓటమిని అంగీకరించారు. ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కానప్పటికీ ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో వున్నట్టు కనిపిస్తోందంటూ తన ఓటమిని ఒప్పుకున్నారు. సిడ్నీలో ప్రజలనుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగిస్తూ మారిసన్, ప్రతిపక్ష నేత, కాబోయే ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మాట్లాడానని, ఆయన ఎన్నికల విజయంపై అభినందనలు తెలియచేసినట్లు చెప్పారు. లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతానన్నారు. పర్యావరణంపై పోరాడే గ్రీన్స్ వంటి చిన్న పార్టీలు, వాతావరణ మార్పులపై దృష్టి కేంద్రీకరించే స్వతంత్ర అభ్యర్ధులు ఈసారి ఎన్నికల్లో కొంత పట్టు సాధించారు. 151 సీట్లు కలిగిన పార్లమెంట్లో మెజారిటీకి అవసరమైన 76సీట్లను ప్రధాన పార్టీలేవీ గెలుచుకునేలా కనిపించడం లేదు. కానీ లేబర్ పార్టీ 70కి పైగా సీట్లను గెలుచుకునే దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం లేబర్‌కి 72సీట్లు వున్నాయి. ఇంకో నాలుగు సీట్లు కావాలి. కాగా, వాతావరణ మార్పులపై చేపట్టే కార్యాచరణకు మద్దతిచ్చేందుకు అవతలి పక్షానికి చెందిన 11మంది సభ్యులు వున్నారని ఏబీసీ ఎన్నికల విశ్లేషకుడు ఆంథోనీ గ్రీన్ పేర్కొన్నారు. మెజారిటీ రాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లేబర్‌పార్టీ భావిస్తే గ్రీన్స్ లేదా ఇండిపెండెంట్లతో మాట్లాడవచ్చని అన్నారు.